
మాస్ మహారాజ రవితేజ 'టచ్ చేసి చూడు', 'అమర్ అక్బర్ ఆంటోనీ' లాంటి వరుస ప్లాప్స్ తో డీలా పడ్డాడు. అందుకే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ప్రస్తుతం "డిస్కో రాజా" చేస్తున్న రవితేజ తదుపరి సినిమాలను కూడా లైన్ అప్ చేసాడు. అందులో భాగంగా రవితేజకు 'బలుపు', 'డాన్ సీను' లాంటి రెండు బ్లాక్ బస్టర్లు ఇచ్చిన డైరెక్టర్ గోపిచంద్ మలినేనితో "క్రాక్" అనే సినిమాను చేయనున్నాడు. ఈ సినిమా పూజ కార్యక్రమాలు నవంబర్ 14న జరిగిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో శృతి హాసన్ రెండేళ్ల తర్వాత రీఎంట్రీ ఇవ్వనుంది. ఆమె చేసిన చివరి సినిమా కాటమారాయుడు. ఇకపోతే క్రాక్ లో రవితేజ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు సమాచారం. అయితే ఆ పోలీస్ ఆఫీసర్ కధ.... అనంతపురంలో సీఐగా చేసి...మెల్లిగా రాజకీయాలపై ఆసక్తితో వైకాపాలో చేరి గత ఎన్నికల్లో హిందూపూర్ నుంచి పోటీ చేసి గెలిచిన ఎంపీ గోరంట్ల మాధవ్ నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సినీ సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది.