
కేసుల పేరుతో మీడియాపై ఆంక్షలు విధించేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమవడంపై తెలుగుదేశం పార్టీ మండిపడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే కేసులు పెడతామని బెదిరించడానికి ఈ రాష్ట్రం వరకూ ప్రత్యేక ఎమర్జెన్సీ అమల్లో ఉందా అని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం గురువారం మధ్యాహ్నం గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. పొలిట్‌బ్యూరో చర్చించిన అంశాలు, నిర్ణయాలను పార్టీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, రావుల చంద్రశేఖరరెడ్డి, కాల్వ శ్రీనివాసులు విలేకరులకు వివరించారు. ‘మీడియా వాచ్ పేరుతో మీడియాపై ఆంక్షలు విధించాలని గతంలో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రయత్నించి తర్వాత పక్కన పెట్టారు. ఇప్పుడు దానికి మరిన్ని జత చేసి ఆదేశాలు జారీ చేయాలని జగన్ మంత్రివర్గం నిర్ణయించింది. వార్త రాస్తే కేసులు పెడతారా? అలాగైతే జగన్ మీడియా రాసిన రాతలకు ఎన్ని వేల కేసులు పెట్టాలి? జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైన రోజు చంద్రబాబు బొమ్మ వేసి ఆయన చేతిలో కత్తిపెట్టి ఆయనే ఆ హత్య చేసినట్లు జగన్ మీడియాలో రాశారు. మేం కేసులు పెట్టామా? ఆయన్ను ఎవరు చంపారో ఇంతవరకూ తేల్చగలిగారా? దానిపై మాట్లాడితే టీడీపీ నేతలకు నోటీసులు ఇస్తారా? నోటీసులు, కేసులతో మీ తప్పులు మరుగున పడిపోతాయా’ అని సోమిరెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు వస్తే మీడియాపై కేసులు పెట్టాలని ముఖ్యమంత్రి స్ధాయి వ్యక్తి ఆదేశించడం దారుణమని కాల్వ వ్యాఖ్యానించారు. అధికార పార్టీ తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టారని 41 మందిని అరెస్టు చేశారని, పోస్టులు పెట్టవద్దని టీడీపీ కార్యకర్తలను పోలీసు స్టేషన్లకు పిలిపించి బెదిరించడం తొలిసారి చూస్తున్నామని దుయ్యబట్టారు. మీడియా ఆంక్షల విషయంలో తాను చేసిన తప్పును వైఎస్ రాజశేఖరరెడ్డి సరిదిద్దుకున్నారని, కానీ జగన్‌కు ఆ తప్పే స్ఫూర్తిగా నిలవడం దురదృష్టకరమని రావుల అన్నారు.