గోదావరిలో 315 అడుగుల లోతు నీటిలో బోటు

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు మందం దగ్గర ప్రమాదానికి గురైన బోటు గోదావరి ఉపరితలం నుంచి 315 అడుగుల లోతులో ఉన్నట్లు రెస్క్యూ బృందాలు గుర్తించినట్లు సాక్షి ఒక కథనం ప్రచురించింది.
మరోవైపు, ప్రమాద స్థలానికి ఇరువైపులా ఎత్తైన కొండలు కూడా ఉండడంతో బోటును వెలికి తీయటం చాలా కష్టంతో కూడుకున్న పని అని నేవీ, పోర్టు వర్గాలు చెబుతున్నాయి.
ప్రమాదం జరిగి 36 గంటలు కావస్తున్నా మొదట దొరికిన ఎనిమిది మినహా ఒక్క మృతదేహం కూడా బయట పడలేదు.
మృతదేహాలన్నీ బోట్‌కు దిగువన లేదా బోట్మొదటి అంతస్తులోని ఏసీ క్యాబిన్లో చిక్కుకుపోయి ఉంటాయని అధికారులు భావిస్తున్నట్లు కథనంలో చెప్పారు.
సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకూ గాలించినా ఒక్క మృతదేహం కూడా లభ్యం కాలేదు. గజ ఈతగాళ్లు, నేవీ డైవర్లు కేవలం 60 అడుగులు లోతు వరకే వెళ్లగలుగుతారు.
ఇలాంటి పరిస్థితుల్లో 315 అడుగుల లోతులో బోటు ఎక్కడ ఉందనేది గుర్తించడం కష్టమేనని అధికారులు చెప్పారని సాక్షి తెలిపింది.
బోటును గుర్తించేందుకు ‘సైడ్స్కాన్సోనార్’: నేవీకి చెందిన డీప్డైవర్స్తో కూడిన బృందం తోపాటు ఉత్తరాఖండ్‌కు చెందిన నిపుణుల బృందం కూడా చేరుకుంది.
వీరి వద్ద ఉన్న ‘సైడ్స్కాన్సోనార్’ ద్వారా బోటు కచ్చితంగా ఎక్కడ ఉందనేది గుర్తిస్తారు. తర్వాత బోటును బయటకు తీసే అవకాశాల్ని పరిశీలిస్తారు.
మృతదేహాలు ఎగువ నుంచి నదిలో కొట్టుకు రావచ్చన్న సమాచారంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 175 గేట్లను పూర్తిగా కిందకు దించేసి బలమైన నైలాన్ వలలు, లైటింగ్ ఏర్పాట్లు చేసినట్లు కథనంలో చెప్పారు.