
జమ్మూకశ్మీరు, లద్దాఖ్ ఈ నెల 31న కేంద్ర పాలిత ప్రాంతాలు (యూటీ)గా ఆవిర్భవించనున్నాయి. అదే రోజున సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని ‘ఐక్యతా విగ్రహం’ వద్ద ప్రధాని మోదీ ఈ రెండు యూటీలకు భారీ ప్యాకేజీ ప్రకటించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్యాకేజీలో ఉండాల్సిన అంశాలపై ప్రధాని కార్యాలయం, హోం శాఖ అధికారులు ఇప్పటికే భేటీ అయినట్లు సమాచారం. ఈ నెల 25లోపే ప్యాకేజీపై తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. జమ్మూకశ్మీరు, లద్దాఖ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ నెల 31 నుంచి ఏడో వేతన సవరణ సంఘం సిఫారసుల మేరకు వేతనాలు, ఇతర ప్రయోజనాలు అందుతాయని కేంద్ర హోంశాఖ మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపింది. మరోవైపు ఆర్టికల్ 370 విషయంలో భారత్‌కు తమ మద్దతు ఉంటుందని అమెరికా పునరుద్ఘాటించింది. అయితే కశ్మీరులో పరిస్థితులపై మాత్రం ఆందోళన వ్యక్తం చేసింది. కాగా.. జమ్మూకశ్మీరు విద్యార్థులు డైలమాలో ఉన్నారు. ఆగస్టు 5 నుంచి విద్యా సంస్థలను మూసి ఉంచడంతో సిలబస్ పూర్తికాలేదు. అధికారులు మాత్రం వార్షిక పరీక్షల షెడ్యూల్ ప్రకటించారు.