
జేఈఈ అడ్వాన్స్ పరీక్ష తేదీ : 2020 మే 17
జేఈఈ– అడ్వాన్స్డ్ పరీక్ష తేదీని ఐఐటీ జాయింట్ అడ్మిషన్ బోర్డ్ ఖరారు చేసింది. దేశంలోని 23 ఐఐటీల్లో ప్రవేశాల కోసం 2020 మే 17వ తేదీన జరిగే పరీక్షను ఢిల్లీ ఐఐటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటీ–డీ) నిర్వహించనుందని ప్రకటించింది. మొట్టమొదటిసారిగా అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలోని బే ఏరియాలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ రాంగోపాల్ చెప్పారు. భారత్లోని ఐఐటీల్లో చదువుకున్న చాలా మంది అమెరికాలో ఉన్నందునే అక్కడ నిర్వహిస్తున్నట్లు వివరించారు. జేఈఈ– అడ్వాన్స్డ్ పరీక్ష ద్వారా దేశంలోని 23 ఐఐటీల్లో ప్రవేశం కల్పించనున్నారు.
జేఈఈ మెయిన్స్ నుంచి గతంలో కంటే వచ్చే ఏడాది 10 వేల మందిని ఎక్కువగా తీసుకుంటామని రాంగోపాల్ వెల్లడించారు. జేఈఈ– అడ్వాన్స్డ్కు అన్ని కేటగిరీలతో కలిపి 2 లక్షల 50 వేల మంది విద్యార్థులను ఎంపిక చేస్తామన్నారు.