
గాంధీజీ సంకల్పయాత్ర ర్యాలీని బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ బుధవారం గుంటూరు జిల్లాలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..టీడీపీ మునిగిపోతున్న నావలాంటిదని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఆ పార్టీలో ఎవరూ మిగలరని జోస్యం చెప్పారు. వలసలను ఆపటానికి బీజేపీతో పొత్తు గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారని, ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదని స్పష్టం చేశారు. అంతేగాకుండా వచ్చే ఎన్నికల్లో టీడీపీతో ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి ప్రత్యామ్నాయంగా, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఎదిగేందుకు కృషి చేస్తున్నామని రాంమాధవ్ తెలిపారు.