
నెలరోజుల్లోగా పాఠ్య ప్రణాళికలో తీసుకురావాల్సిన మార్పులు, చేర్పులపై ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. మార్పులకు అనుగుణంగా టెక్నాలజీకి అవసరమైన పరిజ్ఞానంపై శిక్షణ ఇవ్వడం యూనివర్శిటీల బాధ్యత అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌పై శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు మేకపాటి గౌతంరెడ్డి, ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ... రాష్ట్రస్థాయిలో నైపుణ్యాభివృద్ధి కోసం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆ యూనివర్శిటీ పరిధిలో ప్రతి పార్లమెంటులో ఒక స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ అంటే రాష్ట్రవ్యాప్తంగా 25 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు ఏర్పాటు చేయాలన్నారు. నైపుణ్యాభివృద్ధి కోసం పాఠ్యప్రణాళికలో మార్పులు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగం, ఉపాధి లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు.