
ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల భారత్, చైనా దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోరుపారేసుకున్నారు. ఈ రెండు దేశాలు డబ్ల్యూటీవో పేరు చెప్పుకుని ‘‘లబ్ధి పొందుతున్నాయనీ..’’ అందువల్ల వీటిని అభివృద్ధి చెందుతున్న దేశాలుగా తాము గుర్తించబోమని ట్రంప్ చెప్పుకొచ్చారు. భారత్, చైనా అమెరికాను ‘దోచుకు తింటున్నందున’ ఈ రెండు దేశాలను అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితా నుంచి తొలగించాలని ఇప్పటికే తాను డబ్ల్యూటీవోకి లేఖ రాశానని ట్రంప్ పేర్కొన్నారు. ‘‘డబ్ల్యూటీవో.. ఏం సంస్థ ఇదీ.. నిజంగా ఇది చాలా మంచి సంస్థ.. చైనా కూడా అభివృద్ధి చెందుతున్న దేశమేనని వీరు గుర్తిస్తారు. అందుకే డబ్ల్యూటీవోకి లేఖ రాశాం..చైనాను అభివృద్ధి చెందుతున్న దేశంగా మేము గుర్తించడం లేదు. భారత్ కూడా అభివృద్ధి చెందుతున్న దేశమని మేము గుర్తించడం లేదు. ఎందుకంటే ఈ రెండు దేశాలు మమ్మల్ని దోచుకుంటున్నాయి...’’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.