
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాలుగేళ్ళ క్రితం జనసేన పార్టీ స్థాపించారు. ఆ సమయంలో పార్టీని అయితే పెట్టారుగా దాన్ని చక్కదిద్దలేదు. కొన్ని రోజులు టీడీపీకి, కొన్ని రోజులు బీజేపీకి మద్దతు పలికి చేతులు దులిపేసుకున్నారు. నా లక్ష్యం అధికారం కాదు ప్రజలకు మంచి పరిపాలన అందించటం అంటూ రెండేళ్ల నుంచి సినెమలకు దూరంగా ఉంటూ కేవలం రాజకీయాల్లోనే ఉంటున్నారు. తన దృష్టికి వెళ్లిన కీలక సమస్యలపై పోరాడుతున్నారు. తాజాగా ఇసుక దొరకక కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని దీనిపై ప్రభుత్వం త్వరగా స్పందించాలని విశాఖలో లాంగ్ మార్చ్ కి పూనుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎప్పటిలానే పవన్ ఆవేశంతో ఊగిపోయారు. అధికారంలో ఉన్న వైసీపీపై విరుచుకుపడ్డారు. తనపై ఆరోపణలు చేసిన వైకాపా నేతలపై తన వర్షన్ లో మండిపడ్డారు. ఇసుక సమస్యను రెండు వారాల్లో అరికట్టాలని డిమాండ్ చేశారు. అయితే వైకాపా నేతలు మాత్రం ఇసుక సమస్యను పరిష్కరించడానికి కనీసం 20 రోజులైనా పడుతుందని అంటున్నారు. మరి దీనిపై పవన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.