
బెంగళూరు, మైసూరు ప్రాంతాల్లో ఉగ్రవాద స్లీపర్ సెల్స్ చురుగ్గా ఉన్నాయని, కర్ణాటక తీరం, బంగాళాఖాతం వెంబడి అవి తమ కార్యకలాపాలను తీవ్రతరం చేశాయని కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ బొమ్మై శుక్రవారం పేర్కొన్నారు. మైసూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఆ ఉగ్రవాద స్లీపర్ సెల్స్ జమాత్–ఉల్–ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ)కి చెందినవిగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అనుమానిస్తోందని తెలిపారు. బెంగళూరు, మైసూరుల్లో కూడా స్లీపర్ సెల్స్ ఉండే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వాన్ని మరింత జాగ్రత్త తీసుకోమని ఎన్ఐఏ సూచించిందన్నారు. కోస్టల్, ఇంటీరియర్ కర్ణాటకలోనే కాకుండా బంగాళాఖాతం, అరేబియా సముద్ర తీర ప్రాంతాల్లో కూడా జేఎంబీ కార్యకలాపాలు విస్తరించిందని బొమ్మై హెచ్చరించారు.