
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ, శివసేన పార్టీలు పట్టు వీడటం లేదు. ఎన్నికలకు ముందే కూటమిగా బరిలోకి దిగిన బీజేపీ- శివసేనల మధ్య ఫలితాల అనంతరం విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య నెలకొన్న ఈ సందిగ్దతపై ఎన్సీపీ అధికార ప్రతినిధి క్లైడో క్రాస్టో సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ఓ కార్టూన్ వేసి ట్విటర్లో షేర్ చేశారు. శివసేన పార్టీ అధికార గుర్తు అయిన బాణం...బీజేపీ చిహ్నం కమలానికి గురి ఎక్కుపెట్టినట్లుగా కార్టూన్‌ను చిత్రీకరించారు. కాగా గురువారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 105 సీట్లు గెలుచుకోగా.. శివసేన 56 సీట్లలో జయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కింగ్ మేకర్‌గా అవతరించిన శివసేన.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసిన బీజేపీకి చుక్కలు చూపిస్తోంది. ఎన్సీపీ- కాంగ్రెస్ పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ సంకేతాలు జారీ చేస్తూ బీజేపీని హెచ్చరిస్తోంది.