
‘‘మా ‘రాజుగారి గది 3’కి ప్రేక్షకాదరణ బావుంది. చాలాచోట్ల థియేటర్లు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. కొన్నిచోట్ల వర్షాల వల్ల, తెలంగాణలో ఆర్టీసీ బంద్ వల్ల పల్లెటూళ్ల నుండి నగరాలకు వచ్చి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గిందంతే. అయినా మా సినిమా సేఫ్ జోన్లోనే ఉంది. మా తమ్ముడు అశ్విన్‌ని హీరోగా ప్రేక్షకులు స్వీకరించారు. దీపావళికి పిల్లలు, కుటుంబ ప్రేక్షకులు ఎక్కువ సంఖ్యలో థియేటర్లకు వస్తారని ఆశిస్తున్నా’’ అని ఓంకార్ అన్నారు. అశ్విన్‌బాబు, అవికా గోర్ జంటగా ఓంకార్ దర్శకత్వం వహించిన ‘రాజుగారి గది’ ఇటీవల విడుదలైంది. సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతోందని చిత్రబృందం తెలిపింది. ‘‘కూకట్పల్లి భ్రమరాంబ థియేటర్లో సినిమా చూశా. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు’’ అని అలీ అన్నారు. ‘‘ఈ సినిమాలో వినోదం ఉంది. ప్రేక్షకులకు అది నచ్చింది’’ అని సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో అశ్విన్‌బాబు, అవికాగోర్, గెటప్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.