
మెగాస్టార్ చిరంజీవికి సైరా నర్సింహారెడ్డితో మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు సురేందర్ రెడ్డితో మెగా హీరో వరుణ్ తేజ్ జతకట్టనున్నాడు. సైరాతో సురేందర్ రెడ్డి కెపాసిటీ ఏంటో మరోసారి అందరికి తెలిసిందే. చారిత్రాత్మక సినిమాను ఎన్ని ఆడంకులు వచ్చినా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా తీసి మంచి విజయం సాధించి వార్తల్లో నిలిచారు. అయితే వరుణ్ తేజ్ హీరోగా రాబోతున్న ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే మాత్రమే సురేందర్ అందిస్తున్నాడు. దర్శకత్వ బాధ్యతలను తన శిష్యుడికి అప్పగించి....ఈ సినిమాకు స్వయంగా తానే నిర్మించనున్నాడు. దీనికి కారణం లేకపోలేదు. సైరాతో తన లెవల్ ప్యాన్ ఇండియా సినిమాలు తీసే స్థాయికి వెళ్లిందని అందుకే మొదట తానే చేద్దామని అనుకున్న ఈ సబ్జెక్ట్ ను ఇప్పుడు తన శిష్యుడికి ఇచ్చి సినిమాను నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇక వరుణ్ తేజ్ భిన్నమైన కథలకు ప్రాధాన్యం ఇస్తాడన్న విషయం తెలిసిందే. తాజాగా నటించిన గడ్డలకొండ గణేష్ మంచి విజయం సాధించింది. అదే ఊపులో ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు.