
ఎప్పటిలానే పార్లమెంట్ శీతాకాల సమావేశాల ముందు పార్టీలు సమావేశమై ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశాలపై చర్చించుకుంటారు. ఈసారి ఈ నెల 18న జరగబోయే పార్లమెంట్ శీతాకాలకు సిద్ధమయేందుకు ఇవాళ టీఆరెస్, వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాలు నిర్వహించనున్నాయి. ఈ మేరకు టీఆరెస్ పార్టీ పార్లమెంట్ సమావేశం తెలంగాణ భవన్ లో జరగనుంది. అయితే ఎప్పటిలా ఇది కేసీఆర్ సమక్షంలో జరగడం లేదు. మొదటిసారి టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో జరగనుంది. ఎంపీలందరూ కేటీఆర్ దిశానిర్దేశంలో అడుగులు వెయ్యనున్నారు. మొన్నటి హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కలేదు. దీంతో అదే కాన్ఫిడెన్స్ తో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో తమకు రావాల్సిన నిధులు, పథకాల కోసం కేంద్రాన్ని ఎండగట్టాలని.. దానికి తగ్గ వ్యూహాల గురించి చర్చించనున్నారు. ఇకపోతే వైసీపీ కూడా నేడు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో పార్టీ పార్లమెంటరీ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్ట్, నిధులు, ప్రత్యేక హోదా గురించి చర్చించనున్నారు.