
ప్రతిష్ఠాత్మక ఆర్థిక నోబెల్ విజేత అభిజిత్ బెనర్జీ.. మంగళవారంనాడు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. దాదాపు గంటన్నర సేపు ఇద్దరూ ఏకాంతంగా మాట్లాడుకున్నారు. మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై శరపరంపరగా విమర్శలు గుప్పిస్తూ వస్తున్న అభిజిత్ స్వరం ఈ సమావేశం తరువాత మారిపోయింది. మోదీని, ఆయన విధానాలను అభిజిత్ ఆకాశానికెత్తేశారు. దేశాభివృద్ధిపై మోదీ ఆలోచనలు అద్వితీయమన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం భేష్ అంటూ కితాబిచ్చారు. వివాదాస్పద అంశాల జోలికి వెళ్లేది లేదన్న ఆయన.. ప్రభుత్వ ఆర్థిక విధానాలపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. ‘‘విధానాల గురించి చాలా వింటూంటాం. కానీ వాటి వెనుక ఉన్న కోణాల గురించి చాలా అరుదుగా మాత్రమే వింటాం. భారతావనిపై మోదీ తన ఆలోచనలు విపులంగా చెప్పారు.
అద్భుతంగా నిరుపమానంగా ఉన్నాయవి. ముఖ్యంగా పాలన ఎలా ఉండాలి, ఏం జరగాలన్నది చెప్పారు. ప్రజల విశ్వసనీయత లేకపోవడం వల్ల వాస్తవ పరిస్థితులు ఎలా ప్రభావితమవుతాయి, ప్రభుత్వ ప్రక్రియపై ఓ ఆధిపత్య వర్గం ఎలా అడ్డుగోడలు సృష్టిస్తుందీ, చివరకు ప్రభుత్వాన్ని ఎలా బాధ్యతారహితంగా మార్చేస్తుందీ... తదితర విషయాలు చెప్పారు. ఈ క్రమంలోనే ఉన్నతాధికారుల వ్యవస్థను (బ్యూరాక్రసీ) తాను ఎలా సంస్కరించాలనుకుంటున్నదీ తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా స్పందించేలా బ్యూరాక్రసీని మరింత బాధ్యతాయుతంగా మార్చాలని ఆయన భావిస్తున్నారు... దీన్ని నేనూ అంగీకరిస్తాను. ప్రజల సంక్షేమం, అభ్యున్నతి దిశగా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బ్యూరాక్రసీ పనిచేయాలి.అలాంటి బ్యూరాక్రసీ లేకుంటే నిష్ర్కియాపరమైన ప్రభుత్వమే ఉంటుంది’’ అని అభిజిత్ బెనర్జీ వివరించారు. మోదీ సర్కారు ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రశంసించారు. ‘‘ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం లాంటిది భారత్కు చాలా అవసరం. ఎందుకంటే ఆరోగ్య సంరక్షణ ఖర్చులు కుటుంబాలను తుడిచిపెట్టేస్తున్నాయి. కుటుంబంలో ఒకరు అనారోగ్యంతో మంచం పట్టినపుడు ఉన్న ఆస్తులు పోగొట్టుకోకుండా మనం మార్గాలను వెతకాలి. అందులో ఇదీ ఒకటి.’ అని పేర్కొన్నారు. మన ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్యమైన ప్రయోజనాన్ని ఆయుష్మాన్ భారత్ నెరవేరుస్తోందన్నారు. ప్రధానిని కలవడం తనకో అసాధారణ అనుభవమని కూడా అభిజిత్ పేర్కొన్నారు. సమావేశానంతరం మోదీ, అభిజిత్ బెనర్జీ ట్విటర్ ద్వారా పరస్పరం ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. ‘థాంక్యూ ప్రైమ్ మినిస్టర్, మీ సమయంలో కొంతసేపు నాకోసం వెచ్చించినందుకు కృతజ్ఞతలు..’’ అని అభిజిత్ రాశారు. ‘మానవ సాధికారికత దిశగా ఆయనకునన అంకిత భావం స్పష్టంగా చూశాను. చాలా ఆరోగ్యకరమైన రీతిలో వివిధాంశాలపై విస్తృతంగా మాట్లాడుకున్నాం. ఆయన సాధించిన విజయాలను చూసి దేశం గర్విస్తోంది’’ అంటూ అభిజిత్ గురించి మోదీ ట్వీట్ చేశారు.