
ఏపీలోని పేదింటి ఆడపడుచులకు వైసీపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జగన్ ఇచ్చిన మరో హామీ కార్యరూపం దాల్చింది. ఎన్నికల ప్రచారం, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులకు చెల్లిస్తున్న పెళ్లి కానుక ప్రోత్సాహకాన్ని భారీగా పెంచింది. వైఎస్సార్ పెళ్లి కానుక ఆర్థిక సాయాన్ని పెంచుతూ జీవో జారీ చేసింది. ఈ మేరకు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి రవిచంద్ర సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ పథకంలో భాగంగా గతంలో ఎస్సీలకు రూ. 40 వేలు ఇస్తుండగా.. తాజాగా ఈ మొత్తాన్ని రూ.లక్షకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. అలానే ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహాలను ప్రొత్సాహిస్తూ ఇచ్చే రూ.75 వేల మొత్తాన్ని ఏకంగా రూ.1.20లక్షలకు పెంచింది. గతంలో ఎస్టీలకు ఇచ్చే రూ. 50వేల మొత్తాన్ని.. రూ.లక్షకు, బీసీలకు ఇచ్చే రూ. 35వేలను రూ.50వేలకు, మైనారిటీలకు ఇచ్చే రూ. 50వేలను లక్ష రూపాయలకు, దివ్యాంగులకు ఇచ్చే రూ.లక్షను రూ. 1.50లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అలానే భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చే రూ.20 వేలను లక్ష రూపాయలకు పెంచింది.