
గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ గత నెల 27న ఎమ్మెల్యే పదవికి, టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు గత నెల 31న కేశినేని నాని, కొనకళ్ల నారాయణరావులను వల్లభనేనితో చర్చిలు జరపమని పంపగా...ఆ చర్చలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. అప్పుడు జరిగిన చర్చలో వల్లభనేని వంశీ పార్టీ అంతర్గత విషయాలను, వైసీపీ తనపై బనాయించిన కేసుల గురించి కేశినేని నాని, కొనకళ్ల నారాయణరావులతో చెప్పారట. ఇదే విషయాన్ని వాళ్ళు టీడీపీ అధినేత చంద్రబాబుకు చెప్పగా.... వల్లభనేని నిర్ణయంకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారట. దీంతో వల్లభనేని వంశీ మాత్రం వైసీపీలో చేరేందుకు కొంత ఆసక్తిని చూపుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ మేరకు వల్లభనేని వంశీ తన అనుచరులకు ఈ విషయాన్ని చెప్పినట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ నెల మొదటి వారంలో వైకాపా తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై వల్లభనేని వంశీ నుంచి ఎటువంటి స్పష్టత రాలేదు.