
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటించిన 'అల...వైకుంఠపురములో' యొక్క గ్రాండ్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకుంటూ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు సాధిస్తుంది. అల.. వైకుంఠపురములో చిత్రం “ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్” హోదాను సాధించింది. గతంలో, రేస్ గుర్రం, సరైనోడు వంటి సినిమాలు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు బ్లాక్ బస్టర్లుగా ఉన్నా అవి మొదటి ఐదు జాబితాలో ఉన్నాయి. కాని ఈ సినిమా కలెక్షన్ల పరంగా అగ్రస్థానానికి చేరుకుంది. అల్లు అర్జున్ నటించిన ఈ ఫ్యామిలీ డ్రామా ప్రభాస్ నటించిన బాహుబలి సిరీస్ రికార్డులకు అతి చేరువలో ఉంది. అయితే ఇటీవల మీడియా ఇంటరాక్షన్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ “రికార్డుల విషయానికి వస్తే నా చిత్రం ప్రభాస్ సినిమా పక్కన నిలబడి ఉండటం చాలా సంతోషంగా ఉంది. బాహుబలి సినిమాలో నటించిన ప్రభాస్ కు దక్కిన గుర్తింపు, క్రేజ్, ఇమేజ్, చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే బాహుబలి కోసం 5 సంవత్సరాలు కేటాయించడం మాములు విషయం కాదు. ఈ 5 సంవత్సరాలలో ప్రభాస్ ఎన్నో కోట్లు సంపాదించచ్చు. కానీ ఆ పాత్ర కోసం 5సంవత్సరాలు కేటాయించడం చాలా కష్టం కాని ప్రభాస్ చేసారు" అని కొనియాడారు.