
బిగ్ బాస్ హౌస్ లోకి స్టార్ యాంకర్ సుమ కనకాలను వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి పంపినట్లుగా ప్రోమోలో చూపించారు. కానీ ఈ విషయాన్ని ప్రేక్షకులు నమ్మలేదు. ప్రోమోలో చూపించినప్పటికి ఇది ప్రోమోషనల్ స్టన్ట్ అని అర్ధమైంది. దానికి కారణం స్టార్ యాంకర్ గా సూపర్ పాపులారిటీ ఉన్న సుమ చేతిలో అనేక టీవీ షోలు ఉన్నాయి. చేతినిండా షూటింగ్స్ తో రెండు చేతులా సంపాదించే యాంకర్ సుమ, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం అనేది నిజంగా ఊహించని పరిణామమే. లగేజీతో దిగిపోయిన సుమ, ఇంటిలోకి కూడా వెళ్లినట్లే వెళ్లి మళ్ళీ అదే డోర్ నుంచి బయటకు వచ్చి...'అయ్యో సార్, నేను మర్చిపోయా నాకు 'వైల్డ్ డాగ్', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్', 'ఆర్ఆర్ఆర్' ఇలా వరసగా సినిమా ఫంక్షన్లు ఉన్నాయని' చెప్పింది. దీంతో నాగార్జున మరి ఎప్పుడు బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తావ్ అంటే...'గంగవ్వ వయసు వచ్చాక' అంటూ తాను ఎంత బిజీనో చెప్పకనే చెప్పింది. బిగ్ బాస్ పై పెరుగుతున్న వ్యతిరేకత, తగ్గుతున్న టిఆర్పీ దృష్ట్యా సుమను రంగంలోకి దింపారు యాజమాన్యం. అయితే నష్టనివారణ చర్యలో భాగంగా స్టార్ యాంకర్ ను తెచ్చి షోలో ఉత్సాహం పెంచి నవ్వులు పూయించిన యాజమాన్యం ఆమెకు రెమ్యునరేషన్ భారీగా ముట్టచెప్పినట్లు తెలుస్తోంది. సుమ బిగ్ బాస్ షో కోసం గంటకు 6లక్షలు పారితోషకంగా తీసుకున్నారని సమాచారం. ఇదే నిజమైతే మరి సుమకు భారీ మొత్తంలో వచ్చినట్లే లెక్క.