
రోజు రోజుకు కేజీఎఫ్2 పెరుగుతూ పోతుంది. అర్ధం కాలేదా ? కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈ భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ సెట్స్‌లో మరో స్టార్ యాక్టర్ ఎంట్రీ ఇచ్చారు. కేజీఎఫ్ చాప్టర్ 1 అన్ని భాషల్లో పెద్ద విజయాన్ని సాధించింది. అందుకే తదుపరి చాప్టర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యశ్ ప్రధాన పాత్ర పోషించిన కేజీఎఫ్ తెలుగులో సైతం అద్భుతమైన విజయాన్ని దక్కించుకుంది. ఈ సినిమా టేకింగ్ కు క్రిటిక్స్ సైతం ప్రశంసల జల్లు కురిపించారు. నరాచీ బంగారు గనులపై యశ్ కంట్రోల్ సాధించడంతో కెజిఎఫ్ ముగుస్తుంది. రెండవ భాగంలో కఠినమైన విలన్ అధీరాతో యశ్ పోరాటం మరింత ఘాటుగా మారబోతోంది. సంజయ్ దత్ అధీరా పాత్రను పోషిస్తున్నారు. అలాగే రవీనా టాండన్ ఇటీవలే కెజిఎఫ్ 2 సెట్స్‌లో చేరారు. ఈ చిత్రంలో ఆమె ప్రధానమంత్రి రమిక సేన్ పాత్రలో నటిస్తోంది. ఇప్పుడు అదనంగా ఈ సినిమాలో ప్రముఖ టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేష్ కేజీఎఫ్ 2 సెట్స్‌లో చేరారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ విషయాన్ని వెల్లడించారు. రావు రమేష్ ఈ సినిమాలో ఎలాంటి పాత్రను పోషించబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.