
తెలుగు సినీ పరిశ్రమలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటికే ఎందరో సినీ ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడి కోలుకున్నారు. తాజాగా మెగా ఫ్యామిలీలో హీరోలు ఈ వైరస్ బారిన పడుతుండటం అభిమానులను కలవరపరుస్తోంది. తనకు కరోనా సోకినట్టు ఈ ఉదయం రామ్ చరణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా లక్షణాలు మాత్రం తనలో లేవని చెప్పాడు. హోం క్వారంటైన్ లో ఉన్నానని వెల్లడించాడు. ఈ షాక్ నుంచి మెగా అభిమానులు కోలుకోకముందే మరో ఆందోళనకర వార్త వెల్లడైంది. తనకు కరోనా సోకిందని వరుణ్ తేజ్ తెలిపాడు. తనకు కరోనా పాజిటివ్ అని ఈ ఉదయం నిర్ధారణ అయిందని వరుణ్ తేజ్ వెల్లడించాడు. తనలో కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని చెప్పాడు. ప్రస్తుతం ఇంటి వద్ద స్వీయ నిర్బంధంలో ఉన్నానని... అన్ని జాగ్రత్తలను పాటిస్తున్నానని తెలిపాడు. త్వరలోనే కరోనా నుంచి కోలుకుంటానని చెప్పాడు. మీ ప్రేమకు ధన్యవాదాలు అని ట్విట్టర్ ద్వారా తెలిపాడు.