
నందమూరి కుటుంబం నుంచి వచ్చి తాతకు తగ్గ మనవడిగా తనకంటూ ప్రత్యేకమైన మరియు పదిలమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు జూ.ఎన్టీఆర్. ఈ పేరుతో వచ్చే బాధ్యతను మాటల్లో చెప్పలేనని తారక్ ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. అందుకే ప్రతి పాత్రకు తన ప్రాణం పెడ్తాడు. తన అభిమానులు ఎప్పుడు తలెత్తుకునేలా చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. అందుకనే ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంత పెరుగుతూనే ఉంది. అయితే కోట్ల మంది అభిమానులుంటే అందులో కొంతమంది మాత్రామ్ ప్రాణం పోతున్నా తమ హీరో బాగుండాలని, ఒక్కసారి చూస్తే చాలని కలవరిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం హీరోలు కూడా దిగొచ్చి వాళ్ళ కోరికలను నెరవేర్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఎన్టీఆర్ కూడా అలాంటిదే చేసాడు. ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్లో బిజీబిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తన అభిమాని కోసం పెద్ద మనసు చేసుకున్నారు. మస్క్యులర్ డిస్ట్రోఫీతో బాధపడుతున్న తన అభిమానితో తారక్ వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. ఆ సమయంలో అభిమాని ఎన్టీఆర్తో సెల్ఫీ తీసుకోవాలని ఉందనే కోరికను వ్యక్తం చేశాడు. అతని మాటలను ఓపికగా విన్న ఎన్టీఆర్ పరిస్థితులన్నీ చక్కబడిన వెంటనే అతడిని కలవడానికి వస్తానని అప్పుడు తనతో సెల్ఫీ తీసుకుంటానని హామీ ఇచ్చారు.