
ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ బాబు తన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'ను చేస్తున్న సంగతి విదితమే. గత కొన్ని రోజులుగా ఈ చిత్రం షూటింగ్ దుబాయ్ లో జరుగుతోంది. ఇదిలా ఉంచితే, మరోపక్క మహేశ్ ఇంకో ప్రాజక్టు మీద కూడా దృష్టి పెట్టినట్టు వార్తలొస్తున్నాయి. ఇటీవల సూర్య హీరోగా తెలుగు, తమిళ భాషల్లో 'ఆకాశం నీ హద్దురా' అనే చిత్రం వచ్చింది. ఓటీటీలో రిలీజైన ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. దీనికి మొదటి నుంచీ తమిళంలోనే తన కెరీర్ని కొనసాగిస్తున్న తెలుగు మహిళ సుధ కొంగర దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మహేశ్ కి బాగా నచ్చడంతో ఈ దర్శకురాలితో ఓ ప్రాజక్ట్ చేయాలని అనుకుంటున్నారట. ఈ క్రమంలో ఇప్పటికే మహేశ్ ఇమేజ్ కి తగ్గ పవర్ ఫుల్ సబ్జెక్టును సుధ కొంగర తయారుచేశారనీ, ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయనీ తెలుస్తోంది.