
మనసు మమత, మౌనరాగం వంటి సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన శ్రావణి మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోని మధురా నగర్ లో తన నివాసంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాత్ రూమ్ కు వెళ్లిన శ్రావణి ఎంతసేపటికీ బయటకు రాకపోవటంతో అనుమానమొచ్చిన కుటుంబ సభ్యులు డోర్ పగలకొట్టి చూడగా...వాళ్లు విగత జీవిగా పడున్న కూతురిని చూడాల్సి వచ్చింది. వెంటనే యశోద ఆసుపత్రికి తరలించిన లాభం లేకపోయింది. అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. అయితే టిక్ టాక్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి పెడుతున్న వేధింపులు భరించలేకనే తను ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపించారు. శ్రావణి గత కొన్నేళ్లగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గొల్లప్రోలుకు చెందిన దేవరాజు రెడ్డి అలియాస్ సన్నీతో టిక్ టాక్ పరిచయం ఏర్పడింది.. తనకు తల్లిదండ్రులు ఎవరూ లేరని ఆమెకు దగ్గరయ్యాడు. తర్వాత దేవరాజ్ శ్రావణిని వేధింపులకు గురి చేశాడని చెబుతున్నారు. ఆ మనస్తాపంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుంది అంటున్నారు. దీంతో కుటుంబ సభ్యులు దేవరాజుపై ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.