
కొన్నాళ్ల క్రితం కొన్ని తెలుగు సినిమాలలో కథానాయికగా నటించిన మోనాల్ గజ్జర్ ఆ తర్వాత ఇక్కడ అదృశ్యమైంది. గుజరాతీ, మరాఠీ సినిమాలలో పలు అవకాశాలు రావడంతో అక్కడే దృష్టి పెట్టింది. అయితే, ఇటీవల ఉన్నట్టుండి 'బిగ్ బాస్' రియాలిటీ షోలో ఒక్కసారిగా మెరవడంతో మళ్లీ అందరి దృష్టీ ఇప్పుడు ఈ ముద్దుగుమ్మపై పడుతోంది. అయితే పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ హీరోగా 'సర్కారు వారి పాట' పేరిట ఓ భారీ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ వుంది. ఇందులో ఫలానా హీరోయిన్ నటిస్తుందంటూ ఇప్పటి వరకు కొన్ని పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా మోనాల్ పేరు వినిపిస్తోంది. ఈ ప్రత్యేక గీతానికి మోనాల్ ని తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి, ఇందులో వాస్తవమెంతన్నది చిత్ర బృందం వెల్లడించాలి.