
నాచురల్ స్టార్ నాని చేస్తున్న సినిమాలు ఒకే రకంగా ఉండటంతో బాక్స్ ఆఫీస్ వద్ద కాస్త మెత్తబడ్డ నానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన "జెర్సీ" మంచి హిట్ ఇచ్చింది. ఆ సినిమాను బాలీవుడ్లో కూడా రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన "గ్యాంగ్ లీడర్" మాత్రం ఉన్న అంచనాలను అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో "వి" అనే సినిమాలో నటిస్తున్నాడు. నాని ఇందులో నెగిటివ్ షెడ్ లో కనిపించనున్నాడు. హీరో సుధీర్ బాబు మరో కథానాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇదిలా ఉండగా నానికి రొమాంటిక్ హిట్ ఇచ్చిన దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఆ సినిమా కూడా రొమాంటిక్ లవ్ స్టొరీ నేపథ్యంలో సాగే కథ అని సమాచారం. శివ నిర్వాణ తాజా చిత్రం మజిలీ మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 1న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది.