
కరోనా లాంటి ఒక వ్యాప్తి చెందే విపత్తు వస్తుందని, అందరూ ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తుందని ఎవరు ఊహించారు? కానీ ఉహించనవి జరగడమే జీవితం కదా! దగ్గు వచ్చిన మనసారా దగ్గలేని పరిస్థితి, తుమ్ము వస్తే భయపడాల్సిన దుస్థితి వచ్చింది. కానీ బ్రతుకు బండి ముందుకు సాగాల్సిందే కదా! అందుకే 3నెలల లక్డౌన్ తర్వాత ప్రభుత్వం సుమారు అన్నిటికి అనుమతి ఇచ్చింది ఆఖరికి షూటింగ్లతో సహా. అసలైతే థియేటర్లు తెరవచ్చని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినప్పటికీ రాష్ట్రాలు అందుకు ఇష్టపడట్లేదు. థియేటర్లు తెరిస్తే వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. దీంతో థియేటర్ల మీద ప్రస్తుతానికి ఆశ లేని దర్శకులు, నిర్మాతలు తమ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే బహుభాషా చిత్రాలు ఎన్నో డైరెక్ట్ ఓటీటీలో విడుదలయ్యాయి. ఈనేపథ్యంలో నాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నటించిన 'V' ఓటీటీలో వస్తుందని, ఓ ప్రముఖ ఓటీటీ దిగ్గజం భారీ ఆఫర్ కూడా చేసిందని రకరకాల పుకార్లు వస్తున్నాయి. దీంతో ఈ విషయంపై చిత్ర యూనిట్ స్పందించింది. నానికు V 25వ చిత్రం కావడం ఒక కారణమైతే, ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్లలోనే చూడాలనే ఇంకో బలమైన కారణంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేది లేదని తేల్చి చెప్పేసింది. కాబట్టి ఈ సినిమాని చూడాలంటే థియేటర్లు తెరిచే వరకు ఆగి తీరాల్సిందే.