
నాచురల్ స్టార్ నాని మరో మూవీకి సైన్ చేశాడు. ప్రస్తుతం నాని ప్రజెంట్ చేస్తున్న రాబోయే చిత్రం 'హిట్' యొక్క ప్రచార కార్యక్రమాలలో బిజీగా ఉన్నాడు. ఇందులో విశ్వక్ సేన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. హిట్ చిత్రం ఈ శుక్రవారం గ్రాండ్ రిలీజ్ కోసం సిద్ధమవుతోంది. హిట్ చిత్ర ప్రచార కార్యక్రమాలతో పాటు నాని తన 25వ చిత్రం 'V' విడుదల కోసం కూడా ఎదురుచూస్తున్నాడు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్ట్ చేసిన V షూట్ ఇప్పటికే ముగిసింది. తన 25వ చిత్రం V విడుదలకు ముందే నాని శివ నిర్వాణ దర్శకత్వంలో 26వ సినిమా 'టక్ జగదీష్' ప్రారంభించారు. ఈ రోజు నాని పుట్టినరోజు సందర్భంగా, నాని తన 27వ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన చేశారు. ఇది టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృతన్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎస్ నాగవంశీ నిర్మిస్తున్నారు. కొద్ది సేపటి క్రితం టైటిల్ ను వీడియో రూపంలో రివీల్ చేసింది చిత్ర యూనిట్. టైటిల్ "శ్యామ్ సింగ రాయ్" గా ప్రకటించారు. వీడియోలో ఉన్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వింటుంటే, ఇది థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతుందేమోననే అనుమానం వ్యక్తం అవుతుంది.