
నాచురల్ స్టార్ నాని నటించిన 'V' పై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా అంచనాలే నెలకొన్నాయి. ఈ చిత్రం మార్చి 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో V మేకర్స్ ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. నానితో పాటు V చిత్రంలో సుధీర్ బాబు, అదితి రావు హైదారి, నివేదా థామస్ కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తాజాగా షూటింగ్ ముగించింది. అయితే, యాక్షన్ డ్రామా V లో మరో స్టార్ వచ్చి చేరారు. అతను హీరో కాదు కానీ హీరోను ఎలివేట్ చేసే స్టార్, అతనే ఎస్ తమన్. ఈ చిత్రానికి ఎస్ తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేయనున్నట్లు V మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ వార్త సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. టాలీవుడ్ లో ప్రస్తుతం తమన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయాడు. తమన్ మ్యూజిక్ అందించిన 'అల..వైకుంఠపురములో', 'డిస్కో రాజా', 'వెంకీ మామా' వంటి సినిమాలు హిట్ అవ్వడంతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. మరి ఇప్పుడు నాని Vకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తారో చూడాలి.