
ఆమధ్య చిరంజీవితో కలసి 'సైరా' సినిమాలో కథానాయికగా నటించిన అగ్రతార నయనతార మరోసారి చిరంజీవి సినిమాలో నటించే ఛాన్స్ కనిపిస్తోంది. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా వచ్చిన 'లూసిఫర్' సినిమా మంచి హిట్టయింది. దీనిని చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార నటించనున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ చిత్రంలో ఆమె చిరంజీవి సరసన కథానాయికగా మాత్రం నటించడం లేదు. మలయాళం మాతృకలో మంజు వరియర్ పోషించిన పవర్ ఫుల్ పాత్ర ఒకటి వుంది. అది మోహన్ లాల్ కి సోదరి పాత్ర. దీనికి మంచి స్టేచర్ వుండి, అభినయం ప్రదర్శించగల నటి అవసరం కావడంతో నయనతారను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అంటే, ఈ సినిమాలో చిరంజీవికి నయన్ సోదరిగా కనిపిస్తుందన్నమాట. ఇదిలావుంచితే, ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి.