
తెలుగు సినిమాతో 2011లో అరంగేట్రం చేసిన డైరెక్టర్ 'హేమంత్ మధుకర్' ఆ తరువాత బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ రెండు సినిమాలు తీసి చాలా కాలానికి మళ్ళీ 'నిశేబ్ధం' ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో 3ఏళ్ల తర్వాత అనుష్కాను చూడబోతుండేసరికి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నేల్కున్నాయి. అయితే కరోనా మహమ్మారి ఈ సినిమాకి అడ్డుకట్ట వేసింది. మరి సినిమా రిలీజ్ సంగతేంటి? కరోనా లాక్ డౌన్ సమయంలో హేమంత్ మధుకర్ ఎం చేసారు? ఇలాంటి ఎన్నో విషయాలు అయన 'సినీకలర్జ్' తో పంచుకున్నారు. ఆ ముచ్చట్లు మీకోసం!
Q) కరోనా రావటంతో ఎంతగానో ఎదురుచూస్తున్న 'నిశేబ్ధం' సినిమా వాయిదా పడింది. మీకు ఎం అనిపించింది?
హేమంత్: నిజమేనండి! కరోనా అందరికి దెబ్బ పడింది. ముఖ్యంగా రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న సినిమాలకు ఎక్కువగా ప్రభావం చూపింది. కానీ, ఇంకా ఎవరు ఏమి చేయలేని పరిస్థితి. అంతా చక్కబడేంత వరకు ఎదురుచూడాల్సిందే తప్పా చేసేదేమి లేదు.
Q) కరోనా లాక్ డౌన్ సమయాన్ని ఎలా గడుపుతున్నారు?
హేమంత్: నేను నెగిటివ్ కాకుండా దీన్ని పాజిటివ్ గా తీసుకుంటున్నాను. మంచి అలవాట్లు అలవర్చుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం, కుటుంబంతో సమయం గడపటం, తదుపరి కధలపైనే ఫోకస్ పెట్టడం వంటివి చేస్తున్నాను. ఇదివరకు పెద్ద ఎన్టీఆర్ గారు ప్రొద్దునే 4 గంటలకు లేచేవారట, నేను అదే ఫాలో అవుతూ పాజిటివ్ గా ఉంటున్నాను.
Q) మీరు చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ తెలుగు సినిమా తీస్తున్నారు. ఈ గ్యాప్ లో ఎం చేసారు?
హేమంత్: నేను 2011 వస్తాడు నారాజు సినిమా తర్వాత బాలీవుడ్‌కు వెళ్లడం జరిగింది. అక్కడ సినిమా తీయాలనే కోరిక కానీ అంతా కొత్త అందులోనూ నా రెండొవ హిందీ సినిమాకు ఎంచుకున్న కథ 3D అవ్వడంతో దానికి సుమారు రెండు సంవత్సరాలు పట్టింది. దీంతో మళ్ళీ తెలుగులో సరైన కథ రాసుకొని తీసేసరికి ఇంత సమయం పట్టింది.
Q) మీరు తెలుగు డైరెక్టర్ అయుండి బాలీవుడ్‌కు వెళ్లి రెండు డైరెక్ట్ హిందీ సినిమాలు తీయటం చాలా అరుదు. దాని గురించి ఏమంటారు?
హేమంత్: మన ఇండస్ట్రీ లోని డైరెక్టర్లు ఇప్పటి వరకు తెలుగు సినిమాలనే హిందీలో రీమేక్ చేయటమో లేదా డబ్ చేయటమో చేశారు కానీ డైరెక్ట్ హిందీ సినిమా తీసింది లేదు. నేను అలా రెండు డైరెక్ట్ హిందీ సినిమాలు తీయడానికి కారణం బాలీవుడ్ లో దోరికే ఫ్రీడమ్. అలానే, అక్కడ మనల్ని మనం నిరూపించుకుంటే కానీ మనల్ని బాలీవుడ్ మనిషిలాగ చూడరు. అందుకే ఛాలెంజింగ్‌గా తీసుకొని అక్కడ రెండు సినిమాలు చేశాను.
Q) మరియు బాలీవుడ్‌కు ఉన్న డిఫరెన్స్ ఏమిటి?
హేమంత్: టాలీవుడ్ లో చూసుకుంటే కొంచెం డైరెక్టర్ కి ఫ్రీడమ్ తక్కువ. పెద్ద హీరోలైతే మనం రాసుకున్న స్క్రిప్ట్ ఒకోసారి వాళ్లకు నచ్చినట్లుగా మార్చాల్సి ఉంటుంది. కొన్ని ఆంక్షలు ఉంటాయి. బాలీవుడ్లో ఫ్రీడమ్ ఎక్కువ. మనం రాసుకున్న స్క్రిప్ట్ తోనే ముందుకెళ్లొచ్చు. అలానే క్వాలిటీ పరంగా కూడా బాలీవుడ్ కొంచెం పై స్థాయిలో ఉంటుంది. అదే క్రమశిక్షణ విషయానికి వస్తే టాలీవుడ్‌కు ఏది సాటి లేదు.
Q) మీకు 'ముంబై 125km' నటి వీణ మాలిక్‌కు సంబంధం ఉందని రూమర్. దానిపై మీ స్పందన?
అందులో దాపరికం ఎం లేదు. ఆ సినిమా తీసే సమయంలో ఇలాంటి పుకార్లు ఎన్నో వచ్చాయి. అదే నేను ఒక మగాడితో క్లోజ్ గా ఉంటే ఏ ఇబ్బంది, ఏ రూమర్లు రావు. నేను ఒక అమ్మాయితో కాస్త సన్నిహితంగా ఉంటేనే ఇలాంటివి పుట్టుకొస్తాయి. ఇప్పుడు నేను నా హీరోయిన్ అనుష్కతో సన్నిహితంగా ఉంటే ఇలాంటి రూమర్లే వస్తాయి. అదే నేను మాధవన్ తో ఉంటే రావు కదా? వీణ మాలిక్, నా గురించి రూమర్లు వచ్చినప్పుడు నేను తిరస్కరించలేదు. సరే, నాకు పోయేది ఏముంది! నా సినిమాకి పబ్లిసిటీ వస్తుంది! అని ఊరుకున్నాను. నిజానికి వీణ మాలిక్ మా ఆవిడా మంచి స్నేహితులు. గ్లామర్ ఇండస్ట్రీలో ఇలాంటివి సర్వ సాధారణం.
Q) ఇది పక్కన పెడితే, మీది లవ్ మ్యారేజ్ అని విన్నాము. మీ లవ స్టోరీ గురించి చెబుతారా?
హేమంత్: హ..హ! అవును నాది లవ్ మ్యారేజ్. తన పేరు త్రిప్త. మూవీ షూటింగ్ కోసం కాశ్మీర్ వెళ్ళినప్పుడు అక్కడ తనని చూసి ఇష్టపడ్డాను. నాతో ఉన్న జిమ్మీ షెర్గిల్, విక్కీకి చెబితే ఇంకేంటి వెళ్లి చెప్పు అన్నారు కానీ నాకు భయమేసింది ఆ తర్వాత ధైర్యం చేసి పెళ్లి చేసుకుందామా అని అడిగాను. దానికి తాను ఏమి సమాధానం ఇవ్వకుండ వెళ్ళిపోయింది. తనది హిమాచల్ ప్రదేశ్ అక్కడ కట్టుబాట్లు చాలా బిన్నం. అందుకే, అందరిని ఒప్పించే సరికి సమయం పట్టింది. తన ఫ్యామిలీని ఒప్పించడంలో జిమ్మీ, విక్కీ ప్రధాన పాత్ర పోషించారు. వాళ్లకు ఎప్పటికి కృతజ్ఞుడిని. ఇప్పుడు మాది హ్యాపీ ఫ్యామిలీ.
Q) 'నిశ్శబ్దం' ఎలా మొదలయింది?
హేమంత్: అసలైతే ఈ సినిమా పీవీపీ బ్యానర్ లో తీద్దాం అనుకున్నాను. కానీ అది కుదర్లేదు. అప్పుడు ఒక సందర్భంలో నేను కోనా వెంకట్ గారికి ఈ కధ చెప్పడం జరిగింది. కధ బాగా నచ్చిన కోనా గారు దీన్ని ఏదోలాగ తీయకూడదు హై లెవెల్ లో తిస్తె బాగుంటుంది అని తనే ప్రొడ్యూస్ చేస్తానని అన్నారు. అలా నిశ్శబ్దం సినిమా మొదలయింది.
Q) అనుష్క, మాధవన్‌ల ప్రయాణం ఎలా మొదలయింది?
హేమంత్: కోనా వెంకట్ గారికి కధ చెప్పిన తర్వాత అయన ఎక్కడికో ప్రయాణిస్తున్నప్పుడు అనుకోకుండా అనుష్క గారు కనిపించారు. వాళ్ల మాటల సందర్భంలో కోనా గారు ఇలా నేను ఒక కధ విన్నానని అనుష్క గారికి చెప్పడం, కధ బాగా నచ్చడంతో వెంటనే తాను చేస్తానని చెప్పడం జరిగిపోయాయి. ఇక అనుష్క పక్కన వయసుకు, స్టార్ ఇమేజ్ కు తగ్గట్టుగా తీసుకోవాలని అనుకున్నప్పుడు మొదట వచ్చిన పేరు మాధవన్. వెంటనే ఆయనను కలిసి కధ చెబితే, కధ నచ్చడంతో చేస్తానని అంగీకరించారు.
Q) నిశ్శబ్దంను ముందు నుంచే పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిద్దాం అనుకున్నారా?
హేమంత్: అవును! అంటే, ఈ కధ అలాంటిది. ఈ జానర్ ఫిలింను ఏ బాషాలోనైనా విడుదల చేయొచ్చు. మొదట మొత్తం సైలెంట్ ఫిలిం గా తీద్దాం అనుకున్నప్పటికీ తర్వాత కొన్ని అంజలి, షాలిని పాండే వంటి పాత్రలకు డైలాగ్స్ యాడ్ చేశాము. దీన్ని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించాం కాబట్టే ఆ స్థాయిలో తరగణాన్ని తీసుకున్నాము.
Q) 'నిశ్శబ్దం' OTT లో వస్తుందని జోరుగా ప్రచారం సాగుతుంది. మరి ఎందులో సినిమాను చూడబోతున్నాము?
హేమంత్: నిజమే! మాకు OTTల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. ప్రోడుకార్లు కూడా థియేటర్లు ఎప్పటికి ఓపెన్ అవుతాయో తెలియని ఇటువంటి పరిస్థితిలో OTT లో విడుదల చేయటమే ఉత్తమమని భావిస్తున్నారు. నేను, అనుష్క కూడా అందుకు అంగీకరించాము. ప్రస్తుతం సినిమా సిజి పనులు చివరి దశలో ఉన్నాయి. అది పూర్తి అయ్యేసరికి ఏదోక అధికారిక ప్రకటన చేస్తాము. పరిస్థితి ఇలానే ఉంటే OTT లో రావటం ఖాయం.
Q) మీ తదుపరి సినిమాలు?
హేమంత్: ఈ కొరోనా లాక్ డౌన్ లో రెండు కధలను రాశాను. అవి కూడా థ్రిల్లర్ జానర్ కధలే. కొంతమంది నటులను కలిసి కధలను వినిపించాలి. కానీ అందుకు ఇది అనువైన సమయం కాదని ఎదురుచూస్తున్నాను. పరిస్థితులు కొంచెం సర్దుమణిగాక ఫైనలైజ్ చేస్తాను. ఇకపై నా సినిమాలను పాన్ ఇండియాలోనే తెరకెక్కిద్దామని నిర్ణయించుకున్నా. త్వరలోనే తదుపరి ప్రాజెక్ట్ గురించి ప్రకటన ఇస్తాను.
Q) చివరిగా, టాలీవుడ్డా బాలీవుడ్డా ?
హేమంత్: బాలీవుడ్డే! నేను తెలుగు డైరెక్టర్, మా నాన్న ప్రముఖ ప్రొడ్యూసర్ అయినప్పటికీ నేను బాలీవుడ్ అనడానికి కారణం అక్కడ సినిమాను తీసేందుకు దోరికే ఫ్రీడమ్, క్వాలిటీ. కానీ నా మాతృ బాషా తెలుగు, నేను పుట్టి పెరిగింది ఇక్కడ కాబట్టి టాలీవుడ్ లో కూడా సినిమాలు తీస్తాను.
థాంక్యు హేమంత్ మధుకర్ గారు. నిశ్శబ్దం ఎందులో విడుదలైన మంచి హిట్ అవ్వాలని కోరుకుంటూ...మీకు, మీ టీంకు ఆల్ ది బెస్ట్- సినీ కలర్జ్ ప్రత్యేక కధనం!
-లాస్య గరికపాటి