
యంగ్ హీరో నితిన్ ఇప్పుడు హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అతని చేసిన చివరి 3 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి కాబట్టి, ఈసారి హిట్ నితిన్ కు చాలా కీలకం. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అయిన 'భీష్మ' పై తన ఆశలన్ని పెట్టుకున్నాడు. ఈ సినిమా దర్శకుడు వెంకి కుడుముల, తన మొదటి చిత్రం ఛలో మాదిరిగానే ఈ చిత్రంలో కూడా వినోద అంశాలు ఉండేలా చూసుకున్నారు. మరో 9 రోజుల్లో ఈ చిత్రం విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడటంతో, భీష్మ బృందం ప్రమోషన్లను ముమ్మరం చేసింది. ఈమేరకు ఇప్పటి వరకు రిలీజ్ చేసిన మూడు పాటలకు మంచి రెస్పాన్స్ రాగా, తాజాగా నాలుగో పాట "సింగిల్స్ యాంతమ్" పేరుతో ప్రేమికులరోజు సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. ఈ పాటకు సంబంధించిన పోస్టర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ లో నితిన్ నాలుగు రంగులున్న షర్ట్ వేసుకొని కనిపిస్తున్నాడు. అయితే అదే కలర్ షర్ట్ 1985లో వచ్చిన "విజేత" సినిమాలో చిరు వేసుకున్నడు. ఇది గమనించిన మెగా అభిమానులు నితిన్ ను అభినందిస్తున్నారు.