
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆ పేరు వినిపిస్తేనే చాలు విజిల్స్ తో మారుమోగిపోతుంది. అయితే కేవలం మాములు ప్రజలే కాదు సినీ తారల్లో, దర్శకనిర్మాతల్లో కూడా పవన్ అభిమానులు కొంతమంది ఉన్నారు. వారిలో ఎప్పుడు ప్రముఖంగా వినిపించేవి రెండు పేర్లు..ఒకరు హీరో నితిన్ మరోకరు నటుడు మరియు నిర్మాత బండ్ల గణేష్. అయితే పవర్ స్టార్ ఎప్పుడూ తిరిగొస్తారా మళ్ళీ ఆయనతో ఎప్పుడు సినిమా తీద్దామాని ఎదురుచూస్తున్న దర్శకనిర్మాతల్లో బండ్ల గణేష్ ఒకరు. ఆ సమయం రానేవచ్చినట్లు ఉంది. వకీల్ సాబ్ సినిమాతో తన రీఎంట్రీని ఖరారు చేసిన పవన్ ఆ తరువాత మంచి లైన్ అప్ ను సెట్ చేసుకుంటున్నారు. ఈమేరకు నిర్మాత బండ్ల గణేష్ కు కూడా పవన్ తో మళ్ళీ పని చేసే అవకాశం లభించినట్లు కనిపిస్తుంది. 'నా బాస్ ఒప్పుకున్నారు. మరోసారి నా కళ నెరవేరబోతుందని' బండ్ల గణేష్ పవన్ తో కలిసున్న ఫోటోను పెట్టి ట్వీట్ చేశారు. దీంతో వీరి కలయికలో సినిమా రాబోతుందని అర్ధం అయిపోయింది.