
టాలీవుడ్ లో అన్ని సినిమాలు ఒకవైపు అర్జున్ రెడ్డి సినిమా ఒకవైపు. బలమైన కధతో, బోల్డ్ సన్నివేశాలతో అర్జున్ రెడ్డిని తెరకెక్కించాడు సందీప్ రెడ్డి వంగా. డైరెక్టర్ గా అతనికి మొదటి సినిమానే అయినప్పటికీ సినిమా తీసిన విధానానికి విమర్శకులు సైతం ఫిదా అయ్యి ప్రశంసలు గుప్పించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద భారీ వసూళ్లను సాధించడమే కాకుండా కాంట్రవర్సీలకు కూడా దారి తీసింది. అయితే ఇదే సినిమాకు హిందీలో షాహిద్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి రీమేక్ చేసిన విషయం తెల్సిందే. ఆ చిత్రం కూడా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించింది. దీంతో సందీప్ రెడ్డి వంగా తదుపరి చిత్రం ఏమై ఉంటుందా అని ఆసక్తి పెరిగిపోయింది. ఈ మేరకు ప్రస్తుతం సినీ సిర్కిల్స్ లో ఒక వార్త జోరుగా ప్రచారంలో ఉంది. అదే ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా మైత్రి మూవీస్ బ్యానర్స్ లో భారీ సినిమా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ కూడా తన మార్కెట్ దృశ్య సందీప్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.