
రితీశ్ రాణా దర్శకత్వంలో శ్రీ సింహ హీరోగా, వెన్నెల కిషోర్, సత్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం "మత్తు వదలరా". క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ మ్యూజిక్ దర్శకుడు కీరవాణి కొడుకు శ్రీ సింహ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. అయితే కీరవాణి రాజమౌళి సోదరులు అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజమౌళి సోషల్ మీడియా వేదికగా సినిమాపై తన ఫీడ్ బ్యాక్ ను అందించాడు. ఒక రకంగా తన వాళ్ల కోసం సినిమాకు ప్రమోషన్ చేశాడనమాట. రాజమౌళి చెప్తే కచ్చితంగా ఏదోక విషయం ఉండే ఉంటుందని చాలామంది భావిస్తారు. ఇక నిన్న హైదరాబాద్ లో వేసిన ప్రీమియర్ షో చూసి రాజమౌళి సోషల్ మీడియాలో " నా మనసు ఇంకా సినిమా చుట్టే తిరుగుతుంది. సస్పెన్స్, థ్రిల్లర్ ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. చివరి ఫ్రెమ్ వరకు సస్పెన్స్ ను బాగా మైంటైన్ చేశారు. నా పిల్లలను చూస్తే గర్వంగా ఉంది. మీరు చూసి మీ ఫీడ్ బ్యాక్ ను ఇవ్వండి" అంటూ తన రివ్యూ ఇచ్చాడు.