
వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమే అన్నట్లు ఇప్పటికి తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఏడాదికి ఒక సినిమా వచ్చేలా చూసుకుంటూ ప్రాజెక్టులు సైన్ చేస్తున్నారు. ఇప్పటికి రజినీ స్టైల్, ఆ మ్యానరిజమ్స్ ఎవర్ గ్రీన్ అందుకే అభిమానులు అయన సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుంటారు. అయితే, ప్రస్తుతం 'అన్నత్తే' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మరో సినిమా ప్రకటించాల్సి ఉంది. దీని కోసం టాలెంటెడ్ దర్శకులతో, నిర్మాణ సంస్థలతో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే, తాజా వార్త నిజమైనట్లయితే..రజినీకాంత్ తన తదుపరి సినిమా కోసం సీనియర్ ప్రొడ్యూసర్ కలైపులి ఎస్ తనూతో జతకట్టినట్లు తెలుస్తుంది. వీరి కాంబోలో 2016 లో 'కబాలి' సినిమా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు రెండోసారి వీరి కలయికలో సినిమా రాబోతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.