
ప్రస్తుతం టాలీవుడ్ లో పలు మల్టీస్టారర్ సినిమాలు నిర్మాణంలో వున్నాయి. వాటిలో పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న సినిమా కూడా ఒకటి. మలయాళంలో మంచి హిట్టయిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రానికి రీమేక్ గా ఇది తెరకెక్కుతోంది. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 25 నుంచి హైదరాబాదులో జరుగుతోంది. ఈ క్రమంలో ఈ రోజు రానా దగ్గుబాటి కూడా షూటింగులో జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా పేర్కొంది. పవన్, రానా కాంబినేషన్లో ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. పది రోజుల పాటు ఈ దృశ్యాల చిత్రీకరణ సాగుతుందని తెలుస్తోంది.