
దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'ఆర్ఆర్ఆర్' కరోనా కారణంగా ఆలస్యం అయింది. చిత్ర బృందం కరోనా నిబంధనలు పాటిస్తూ తక్కువ మందితో షూటింగ్ ను శరవేగంగా జరుపుతున్న విషయం తెలిసిందే. మొన్నీమధ్య మహాభళేశ్వరం లో ఒక చిన్న షెడ్యూల్ పూర్తి చేసుకున్న టీం ఇప్పుడు క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభించింది. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. క్లైమాక్స్ మొదలైంది.. నా రామరాజు, భీమ్ ఇద్దరూ వాళ్లు కోరుకున్న దానికోసం యుద్ధం మొదలు పెట్టారు అంటూ ట్వీట్ చేసాడు రాజమౌళి. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ క్లైమాక్స్ షూటింగ్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ పాల్గొంటున్నారు. 2022లో ఈ సినిమాను విడుదల చేయనున్నాడు జక్కన్న. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే కనీసం ఈసారైనా అనుకున్న టైంకి సినిమా విడుదలైతే చాలని ప్రేక్షకులు అనుకుంటున్నారు.