
ఆర్టీసీ కార్మికులు తమకు న్యాయం జరగాలంటూ రోడ్డెక్కి సుమారు 50రోజులకు పైగా సమ్మె చేసిన సంగతి తెలిసిందే. కానీ ప్రభుత్వం మాత్రం ఒక్క మెట్టు కూడా కిందకి దిగి రాలేదు. ఆర్టీసీని ప్రైవేటు చేస్తామంటూ ప్రభుత్వం నిత్యం మొట్టికాయలు వేస్తూనే ఉంది. ఇక కోర్టులో కూడా కార్మికులకు అనుకూలంగా తీర్పు రానందుకు సమ్మె విరమించి విధుల్లోకి చేరారు. అయితే ఆర్టీసీ ఉద్యోగులపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల వర్షం కురిపించారు. ఏఒక్కరినీ ఉద్యోగంలోంచి తియ్యబోమని హామీ ఇచ్చారు. ఒక్క రూటులో ఒక్క ప్రైవేటు బస్సుకు కూడా అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 సంవత్సరాలకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ నెల జీతం కూడా అందిస్తామన్నారు. వచ్చే ఏడాది నుంచి ఏటా బడ్జెట్ లో ఆర్టీసీకి రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తామని వెల్లడించారు. నాలుగునెలల్లోనే ఆర్టీసీ లాభాల బాట పట్టాలని దిశానిర్దేశం చేశారు.