
ఆర్టీసీ కార్మికులు 52రోజుల పాటు తమ డిమాండ్లను నెరవేర్చాలని రోడ్డెక్కి సమ్మె చేసిన విషయం తెలిసిందే. కానీ ఎన్ని రోజులు గడిచినా ప్రభుత్వం ఒక్క మెట్టు కూడా దిగి రాకపోవడంతో సమ్మె విరమించి విధుల్లోకి చేరారు ఆర్టీసీ కార్మికులు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులకు వరాల జల్లు కురిపించిన విషయం విదితమే. సమ్మె చేసిన రోజులకు కూడా జీతం చెల్లిస్తామంటూ కేసీఆర్ హామీ ఇచ్చారు. అంతేకాదు ఆర్టీసీ కార్మికుల రిటైర్మెంట్ ఏజ్ ను 58 నుంచి 60కు పొడిగించారు. అయితే వరాల జల్లు ఇవ్వడం బాగానే ఉంది కాని ప్రయాణికులకు ఒక పెద్ద షాక్ ఇచ్చారు. ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు తప్పట్లేదని ప్రకటించారు. కిలోమీటరుకు 20 పైసలు పెంచుతున్నట్లుగా ప్రకటించారు. ఈ ఛార్జిలు మంగళవారం నుంచి అమల్లోకి తెచ్చింది. అయితే సోమవారం నాడు ప్రయాణం ప్రారంభించి దూర ప్రాంతాలకు ప్రయాణించేవారికి.. టికెట్లు ముందుగా బుక్చేసుకున్నవారికి పాతచార్జీలే వర్తిస్తాయని ఆర్టీసీ స్పష్టంచేసింది.