
కరోనా మహమ్మారి ఎవరిని వదలడం లేదు. ఎంతోమంది ప్రముఖులు కూడా దీని భారిన పడి చావు అంచులదాక వెళ్లి వస్తుంటే కొంతమంది చివరి నిమిషం వరకు పోరాడి ప్రాణాలు వదిలేస్తున్నారు. అయితే తాజాగా ప్రఖ్యాత ప్లేబ్యాక్ సింగర్ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యంకు కోవిడ్ -19 నిర్ధారణ తర్వాత 10 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన విషయం విదితమే. అతను కోవిడ్ -19 కి చికిత్స పొందుతున్న చెన్నైలోని ఎంజిఎం హెల్త్‌కేర్ నుండి వచ్చిన ఒక ప్రకటన ప్రకారం, అతను ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నాడని, పరిస్థితి క్రిటికల్ గా ఉందని తెలుస్తోంది. ఆగస్టు 5 నుండి కోవిడ్ లక్షణాలతో ఎంజిఎం హెల్త్‌కేర్‌లో చేరిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం ఆగస్టు 13న మరింత క్షిణించింది. దీంతో ఆయనకు చికిత్స చేసిన వైద్య బృందం సలహా ఆధారంగా, అతన్ని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించారు మరియు వెంటిలేటర్ పై ఉంచారు. ప్రస్తుతం, ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని ప్రకటనలో పేర్కొంది. కొద్దీ రోజుల క్రితం తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని కానీ బయపడేందుకు ఏమి లేదు, తాను ఆరోగ్యంగా ఉన్నానని వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరానని చెప్పిన ఎస్పీబీ ఇప్పుడు ఇటువంటి పరిస్థితిలో ఉండటం బాధాకరం. అయితే బాలు గారు త్వరగా కొలుకోని ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుందాం.