
రామ్ నాకు చాలా ఏళ్లుగా తెలుసు: సింగర్ సునీత
12-01-2021 Tue 15:04
- రామ్ తో కొత్త జీవితం ప్రారంభం కావడం సంతోషంగా ఉంది
- నా సోషల్ మీడియా అకౌంట్స్ చూసుకునేవాడు
- ఏళ్లు గడుస్తున్న కొద్దీ మా స్నేహం బలపడింది
ప్రముఖ సినీ గాయని సునీత వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ నెల 9న శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం వేదికగా వీరి వివాహం జరిగింది. వీరిద్దరికీ ఇది రెండో వివాహం కావడం గమనార్హం. మరోవైపు తన పెళ్లి గురించి ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ సునీత ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రామ్ తో తన కొత్త జీవితం ప్రారంభం కావడం తన అదృష్టమని చెప్పారు. రామ్ తనకు చాలా ఏళ్లుగా తెలుసని... తన సోషల్ మీడియా అకౌంట్స్ ని చూసుకునేవాడని తెలిపారు. ఏళ్లు గడుస్తున్న కొద్దీ ఆ స్నేహం బలపడిందని చెప్పారు. ఆ బంధాన్ని ముందుకు తీసుకెళ్దామనుకున్నామని అన్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతోనే తమ వివాహం జరిగిందని చెప్పారు. కష్టసుఖాల్లో అండగా నిలిచే వ్యక్తి తనకు రామ్ రూపంలో దొరికాడని సునీత తెలిపారు.