
మన దర్శక దిగ్గజం ఏ మూహర్తన బాహుబలి లాంటి గర్వించదగ్గ చిత్రం తీశారో తెలీదు కానీ అందులో నటించిన రెబల్ స్టార్ ప్రభాస్ కు మాత్రం దశ తిరిగింది. ఇప్పుడు ప్రభాస్, తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో అందుకోలేనంత ఎత్తుకు ఎదిగాడు. పాన్ ఇండియా లెవెల్ లో విపరీతమైన క్రేజ్ మరియు మార్కెట్ సంపాదించిన ఏకైక తెలుగు హీరో ప్రభాస్. అందుకే, రెబల్ స్టార్ ఏ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన అది సెన్సేషన్ అవుతుంది. అలాంటిది, ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రాముడి గెటప్ లో ప్రభాస్ సినిమా అనౌన్స్ చేస్తే తట్టుకోగలరా? సోషల్ మీడియా మొత్తం ప్రభాస్ తాజాగా ప్రకటించిన తన 22వ చిత్రం 'ఆదిపురుష్' గురించి రోజుకో వార్తతో మోతమోగిపోతుంది. సినిమాకు సంబంధించిన ఎన్నో చర్చలు జరుగుతుండగా ప్రముఖంగా మాత్రం ప్రతినాయకుడి పాత్ర గురించే చర్చ సాగుతోంది. రావణుడిగా ఎవరైతే బాగుంటారని సోషల్ మీడియా వేదికగా పలువురు స్టార్ హీరోల పేర్లను సూచిస్తున్నారు. ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ బాలీవుడ్ లో తెరకెక్కించిన 'తన్హాజి' లో నటించిన అజయ్ దేవగన్ అయితే రావణుడిగా సరిగ్గా సరిపోతాడని, ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ తో కూడా టాలీవుడ్‌కు పరిచయం అవుతుండడంతో పాన్ ఇండియా లెవెల్ కి సెట్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. మరి కొందరైతే, రోబో 2.0 లో అక్షయ్ కుమార్ విలన్ గా అద్భుతమైన నటన కనబరిచారు ఇందులో కూడా రావణుడిగా సెట్ అవుతారని సూచిస్తున్నారు. అంతేకాకుండా 'బాహుబలి'కి సమానమైన భల్లాలదేవుడుగా కనిపించిన రానా దగ్గుబాటి నే 'ఆదిపురుష్'లో రిపీట్ చేయమని సలహా ఇస్తున్నారు. మరి ఇంతకీ చిత్ర యూనిట్ ఎవరిని ఖరారు చేస్తుందో తెలియాలంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే.