
ఈ సంవత్సరంలో ఎంతోమంది సినీ ప్రముఖులు ఒకరి తర్వాత ఒకరు కాలం చేస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లోని మరో ప్రముఖ నటుడు తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారు. ఎంతోమందిని తన కామెడీతో కడుపుబ్బా నవ్వించి, విలనిజమ్ తో నటనలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న సీనియర్ నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన బాత్రూమ్లోనే కుప్పకూలగా, వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. గుంటూరులోని తన నివాసంలో జయప్రకాష్ తుదిశ్వాస విడిచారు. జయప్రకాష్ రెడ్డి సొంతూరు కడప జిల్లా ఆళ్లగడ్డ మండలం సిరివెల్ల. సినిమాల్లోకి రాకముందు ఎస్సైగా పనిచేసిన జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మపుత్రుడుతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. ప్రేమించుకుందాం రా, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, జయం మనదేరా, విజయరామరాజు, చెన్నకేశవ రెడ్డి, గబ్బర్‌సింగ్, నాయక్, బాద్షా, రేసుగుర్రం, మనం,టెంపర్, సరైనోడు, ఖైదీ నంబర్ 150, రాజా ది గ్రేట్ వంటి హిట్ చిత్రాల్లో నటించిన జయప్రకాష్ రెడ్డి.. చివరిసారిగా మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' లో కనిపించారు. కమెడియన్‌గా, విలన్‌గా, కారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు జయప్రకాష్ రెడ్డి. ముఖ్యంగా ఆయన రాయలసీమ మాండలీకానికి ఎన్నో ప్రశంసలు వచ్చాయి. ఈ షాకింగ్ న్యూస్ విన్న సినీ ప్రముఖులందరు సోషల్ మీడియా వేదికగా తమ నివాళులు అర్పిస్తున్నారు.