Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటూ ఉంటారు. ఆయన కూడా, సినిమాలు చేయకపోతే పార్టీని నడపలేనని చెబుతూ ఉంటారు. అంతా, బాగానే ఉంది కానీ, రోజురోజుకూ రాజకీయ సమీకరణాలు మారిపోతున్న ఈ తరుణంలో ఇంకా ఆయన సినిమాలు చేసుకుంటూ కూర్చుంటాడా? అంటూ ఆయన అభిమానులే కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే, సీఎం పీఠం గురించి ఈ మధ్య రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) తర్వాత సీఎం పీఠంపై కూర్చునేది ఆయన తనయుడు లోకేష్ (Nara Lokesh) మాత్రమేనని, మళ్లీ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఊడిగం చేయాల్సిందే అనేలా.. యాంటీ ఫ్యాన్స్, వైఎస్ఆర్‌సీపీ (YSRCP) కార్యకర్తలు, నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. చినబాబును త్వరలోనే సీఎం పీఠంపై కూర్చోబెట్టబోతున్నారంటూ వార్తలు కూడా వైరల్ చేస్తున్నారు. అందులో నిజంగా ఉందా? లేదా? అనేది పక్కన పెడితే, ఇంకా ఎంతకాలం నేర్చుకుంటాననే పవన్ చెబుతాడు? అని సొంతం పార్టీలోని నేతలు కూడా అనుకుంటూ ఉండటం విశేషం.
కొంత స్వార్థంగా ఆలోచించాలి
నిజమే, రాజకీయంగా పవన్ కళ్యాణ్‌కు అంతగా ఏమీ తెలియకపోవచ్చు, కానీ.. ఆయన ఏం చేసినా మంచే చేస్తాడనే థాట్ అయితే జనాల్లో ఉంది. మొన్నటి ఎన్నికలలో ఆయన గెలిచిన తర్వాత చేస్తున్న పనులన్నీ ప్రజలకు తెలుస్తూనే ఉన్నాయి. ప్రజలందరికీ, ఆఖరికి వైసీపీ సానుభూతిపరులు కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసే పనులపై పాజిటివ్‌గా స్పందిస్తుంటారు. మొదటిసారి రెండు చోట్ల ఓడిపోయినా, ధైర్యంగా నిలబడి వందశాతం సక్సెస్ రేట్ కొట్టిన పవన్ కళ్యాణ్.. కొంత స్వార్థంగా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని, ఇప్పుడే కాకపోయినా, ఫ్యూచర్‌లో అయినా తను సీఎం క్యాండెట్ అనే ఫీల్‌ని క్యాడర్‌కు ఇవ్వాలని, రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయ పడుతున్నారు. మెగా అభిమానులలో కూడా ఈ కోరిక ఉంది. మరి ఆ దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు ఎప్పుడు పడతాయనేది మాత్రం అర్థం కాని ప్రశ్న.
స్ట్రాటజీనా?
మరోవైపు పవన్ కళ్యాణ్‌కు ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ, ఎప్పుడు, ఎలాంటి స్టెప్ తీసుకోవాలనేది స్పష్టమైన అవగాహన ఉన్నట్లుగా కూడా అంతా మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నడుస్తుంది. కూటమిలో తన పార్టీ ఉంది. ఎలా పడితే, అలా స్టేట్‌మెంట్స్ ఇస్తే.. మొదటికే మోసం వస్తుందని పవన్ కళ్యాణ్‌కు తెలుసు. అందుకే ఆచితూచి అడుగులు వేస్తున్నారని, అందుకే సీఎం పీఠం కోసం కంగారు పడటం లేదనేలా కూడా టాక్ ఉంది. ప్రస్తుతం నేర్చుకుంటున్నట్లుగా కనిపిస్తున్నా, బ్యాగ్రౌండ్‌లో పవన్ తన పార్టీని బలోపేతం చేసుకుంటున్నారని, క్యాడర్‌ని స్ట్రాంగ్‌గా రెడీ చేసుకుంటున్నారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విధంగా చూస్తే, పవన్ కళ్యాణ్ మంచి స్ట్రాటజీతోనే ఉన్నారని, వెళుతున్నారని అనిపించక మానదు.
ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఏం చేశారు? – Pawan Kalyan
ప్రజల్లో మాత్రం ఆయనపై మంచి నమ్మకం ఏర్పడిందనేది మాత్రం నిజం. ఏ చిన్న విషయం ఉన్నా, సమస్య ఉన్నా, ఆయన రియాక్ట్ అయ్యే తీరు.. ప్రజలకు ఆయనని దగ్గర చేస్తోంది. మరీ ముఖ్యంగా రోడ్ల విషయంలో ఆయన చూపిస్తున్న చొరవ, వెంటనే పనులు జరిగిపోతుండటం మంచి పరిణామం అనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే, కూటమి గెలిచిన తర్వాత ఏ ఎమ్మెల్యే, ఎంపీ చేయని విధంగా పవన్ కళ్యాణ్ పనులు చేస్తుండటం, ఆయన పేరు వినబడుతుండటం అంతా గమనిస్తూనే ఉన్నారు. నిజంగా ఒక ఎమ్మెల్యే ఏమేం చేయవచ్చో, ఒక మంత్రి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చనేది పవన్ కళ్యాణ్ చేస్తున్న పనులతో తెలుస్తోంది. ఇంత వరకు ఉన్న ఎమ్మెల్యేలు ఎందుకు ఇలా పనులు చేయలేదు? మంత్రిగా పవన్ కళ్యాణ్ ఇన్ని పనులు చేయిస్తుంటే, ఇన్నాళ్లు ప్రజలను పాలించిన నేతలు నిద్రలు ఎందుకు పోయారు? అనేలా ప్రశ్నించే రోజు కూడా రావచ్చనే పరిస్థితికి పవన్ కళ్యాణ్ తీసుకెళుతున్నారనేది మాత్రం వాస్తవం.
సినిమాలు మానేయాలా?
పవన్ కళ్యాణ్ చేసే పనులు చూసి.. వీడు ఎక్కడ ఉన్నా రాజేరా? అనేలా ఇతర పార్టీల నాయకులు, సొంత కూటమిలోని వారు కూడా మాట్లాడుకుంటున్నారు. ఎలా అయినా, ఆయన పేరు వినిపించకుండా ఉండాలని, సినిమాలను సాకుగా చూపిస్తున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ సినిమాలు మానేయాలా? అంటే అవసరం లేదని చెప్పాలి. ఎందుకంటే, పని చేయాలనే చిత్తశుద్ధి ఉంటే, ఆయన ఎక్కడ ఉన్నా పనులు జరుగుతూనే ఉంటాయి. అదే జరుగుతుంది కూడా. ఏ శాఖలో ఎవరిని పెట్టుకుంటే, పనులు చకచకా పూర్తి చేస్తారో తెలుసు కాబట్టే.. తన చుట్టూ ఉన్న అధికారుల నియామకం ఆయనే స్వయంగా చేసుకున్నారు. అలాంటప్పుడు ఆయన సినిమాలు చేసుకున్నా ప్రాబ్లమ్ ఏముంది? ప్రజల ప్రాబ్లమ్స్‌కు రియాక్ట్ అవుతున్నారు కదా! అని ప్రజలే అంటున్నారంటే, పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆయన నిరభ్యంతరంగా సినిమాలు చేసుకోవచ్చు. ఆయన సినిమాలు చేసినా, వచ్చిన డబ్బుని మళ్లీ ప్రజల కోసమే ఖర్చు పెడుతున్నారనే భావన కూడా ప్రజల్లో ఉంది కాబట్టి.. ఇది ఆయన రాజకీయ మనుగడకు అస్సలు అడ్డమే కాదు.
Also Read- Virosh Wedding: విజయ్, రష్మికల ప్రేమ నుంచి పెళ్లి రిసెప్షన్ వరకు.. జరిగింది ఇదే!
అధికారిక ప్రకటన వస్తేనే..
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదలకు సిద్ధమైంది. మార్చి 26న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. సినిమా ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. దర్శకుడు హరీష్ శంకర్ ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమా ప్రమోషన్స్‌ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు మంచి స్పందనను రాబట్టుకుని చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఇంకా రాబోయే ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచేయడం ఖాయం. ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాను పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు. కానీ, ఈ సినిమా ఇప్పుడప్పుడే పట్టాలెక్కేలా అయితే కనిపించడం లేదు. ప్రస్తుతం ఆగిపోయిందనేలా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన సినిమాలు చేస్తారా? లేదా? అనేది.. సురేందర్ రెడ్డితో చేయాల్సిన సినిమా అప్డేట్ వస్తేగానీ తెలియదు. ఈ సినిమా కాకుండా, కొన్ని సినిమాలలో పవన్ కళ్యాణ్ చేస్తున్నట్లుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి కానీ, అధికారిక ప్రకటన మాత్రం ఏదీ రాలేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పొలిటికల్ సినారియోని దృష్టిలో పెట్టుకునే అడుగులు వేసే క్రమంలో ఉన్నారనేలా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫ్రెష్ స్టోరీతో..
పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) సినిమా సంగతికి వస్తే.. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం నటిస్తోంది. ఈ సినిమా మొదట కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘థేరి’ చిత్రానికి రీమేక్ అనేలా వార్తలు వచ్చాయి. కానీ, చిత్రయూనిట్, ముఖ్యంగా హరీష్ శంకర్ ఆ వార్తలను ఖండించడమే కాకుండా, ఈ సినిమా ఫ్రెష్ స్టోరీతో రూపొందినట్లుగా చెబుతూ వస్తున్నారు. కానీ, ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మాత్రం అదే చిత్రమనేలా అనుమానాలను కలిగిస్తోంది. ఈ క్రమంలో త్వరలో రాబోయే గ్లింప్స్ అన్నింటికీ సమాధానం ఇస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఒకవేళ రీమేక్ అయినా, హరీష్ శంకర్ తనదైన స్టైల్‌లో సినిమాను మార్చేస్తారనే నమ్మకం కూడా ఫ్యాన్స్‌లో ఉంది. ‘గబ్బర్ సింగ్’ కూడా రీమేకే. కానీ, అందులో కొన్ని సన్నివేశాలను ఒరిజినల్ టీమ్ కూడా తర్వాత చిత్రానికి వాడుకుందంటే, హరీష్ శంకర్ దర్శకత్వ ప్రతిభ ఎలాంటిదో తెలుసుకోవచ్చు.
PSPK in full swag mode throughout the film – a guaranteed eruption in theatres and a grand celebration for fans ❤🔥❤🔥
25 DAYS TO GO for #UstaadBhagatSingh 🔥🔥
GRAND RELEASE WORLDWIDE ON 26th MARCH, 2026.#UBSOnMarch26th
POWER STAR @PawanKalyan @harish2you @sreeleela14… pic.twitter.com/LMzrcqZCNQ
— Ustaad Bhagat Singh (@UBSTheFilm) March 1, 2026
హరీష్ శంకర్‌కు ఎంతో కీలకం
మరోవైపు హరీష్ శంకర్‌కు ఈ సినిమా చాలా కీలకం. ఆయన నుంచి హిట్ వచ్చి చాలా కాలం అవుతుంది. ఈ సినిమాతో తనేంటో నిరూపించుకోవాలి కాబట్టి.. జాగ్రత్తగానే సినిమాను తెరకెక్కించి ఉంటారని భావించవచ్చు. ‘ఓజీ’ (OG Movie) తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో, ఈ సినిమాపై ఫ్యాన్స్, ప్రేక్షకులందరూ ఎంతో నమ్మకంగా ఉన్నారు. సంక్రాంతి సినిమాల తర్వాత మళ్లీ ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పించే సినిమా ఇదే అవుతుందని ట్రేడ్ వర్గాలు సైతం ఆశిస్తున్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో?

