Virosh Wedding: గత వారం, పది రోజులుగా ఎక్కడ విన్నా రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) గురించే వినబడుతోంది. వాస్తవానికి వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తూ వచ్చాయి. కానీ, ఎక్కడా వారు రివీల్ చేయలేదు. కానీ, వారిద్దరూ కనబడిన సందర్భాలు, ప్లేస్‌లు జనాలకు అనుమానాలు తెప్పిస్తూనే ఉన్నాయి. ఆ అనుమానాలకు తెరదించుతూ ఇప్పుడీ జంట ఒక్కటయ్యారు. నూతన జీవితాన్ని, అదే విరోష్‌గా పెళ్లి (Virosh Wedding) బంధంలోకి అడుగు పెట్టారు. అసలు వారి ప్రేమ ఎలా మొదలైంది? ఆ ప్రేమ పెళ్లి వరకు రావడానికి మధ్య ఏం జరిగింది? పెళ్లి తర్వాత వారిద్దరి మూవ్ ఏంటి? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చిన్న చిన్న పాత్రలతో మొదలై..
ముందుగా విజయ్ దేవరకొండ విషయానికి వస్తే.. ‘నువ్విలా’, ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’, ‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు చేసిన విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత ‘పెళ్లిచూపులు’ చిత్రంతో హీరోగా మంచి బ్రేక్ అందుకున్నారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం, బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ను అందుకుంది. ఆ సినిమా తర్వాత విజయ్ చేసిన ‘ద్వారక’ చిత్రం అంతగా సక్సెస్ కాలేదు. కానీ, ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో చేసిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా.. విజయ్ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా, ఒక్కసారిగా స్టార్ స్టేటస్‌ని తెచ్చిపెట్టింది. ఆ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ రేంజే మారిపోయింది. ఫాలోయింగ్, ఫ్యాన్స్ అంటూ హడావుడి మొదలైంది. ఆ సినిమా తర్వాత ‘ఏ మంత్రం వేసావే’ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ సినిమా తర్వాత చేసిన ‘మహానటి’లో పాత్ర మంచి పేరును తెచ్చిపెట్టింది.

కెమిస్ట్రీకి అంతా ఫిదా
‘మహానటి’ తర్వాత విజయ్ దేవరకొండ చేసిన చిత్రమే ‘గీత గోవిందం’. ఈ సినిమా ఆయన లైఫ్‌నే మార్చేసింది. అప్పటి వరకు మాస్ ఇమేజ్‌ని క్యారీ చేసిన విజయ్ దేవరకొండకు, క్లాస్ ఆడియన్స్ కూడా ఫ్యాన్ అయ్యేలా చేసింది. అంతేనా, తన జీవితం కూడ అక్కడే టర్న్ అయింది. ఆ సినిమాలో తనకు జోడీగా నటించిన రష్మికనే, ప్రస్తుతం విజయ్ వివాహమాడారు. ‘గీత గోవిందం’ సినిమాలో విజయ్, రష్మికల కెమిస్ట్రీకి అంతా ఫిదా అయ్యారు. అంతేనా, రూ. 100 కోట్లకు పైగా ఆ సినిమాకు కలెక్షన్స్ ఇచ్చేశారు. అప్పడు మొదలైంది రష్మిక, విజయ్‌ల మధ్య స్నేహం. అవును, ఆ సినిమాతో మొదలైంది కేవలం స్నేహం మాత్రమే. చాలా మంది, ఆ సినిమాతోనే వారిద్దరి మధ్య ప్రేమ మొదలైందని అనుకుంటున్నారు కానీ, అది వాస్తవం కాదు. ఆ సినిమా వారిద్దరినీ మంచి స్నేహితులని చేసింది. అది ఎలాంటి స్నేహం అంటే, ఒకరి ఇంటికి మరొకరకు స్వేచ్ఛకు వెళ్లగలిగేంతగా మార్చేసింది.
నేషనల్ క్రష్‌గా..
కన్నడ సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన చిత్రంతోనే సక్సెస్ అందుకున్న రష్మికకు, ఆ సినిమా అవకాశం ఇచ్చిన దర్శకహీరో రక్షిత్ షెట్టితో ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఇంకొన్ని రోజుల్లో పెళ్లి అనగా, మరి ఏం జరిగిందో తెలియదు, ఆ నిశ్చితార్థాన్ని రష్మిక క్యాన్సిల్ చేసుకుంది. తను ఇచ్చిన అవకాశాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్నాడని భావించి, రక్షిత్‌ని, కన్నడ ఇండస్ట్రీని రష్మిక దూరం పెట్టేసింది. అప్పుడే తీసుకుంది నెక్ట్స్ జర్నీ టాలీవుడ్‌లోనే అని. అలా టాలీవుడ్‌కి వచ్చిన రష్మిక మొదటి సినిమా ‘ఛలో’తో మంచి సక్సెస్ అందుకుంది. మళ్లీ ఆమె వెనుదిరిగి చూసుకునే అవకాశం లేకుండా, వరస అవకాశాలు రావడంతో.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకెళ్లింది. పోటీగా ఉన్న పూజా హెగ్డేకు కూడా టఫ్ ఫైట్ ఇచ్చి, ఆమెని ఇండస్ట్రీలోనే లేకుండా చేసింది. ఇక ‘పుష్ప’ సిరీస్ చిత్రాలతో ఆమె క్రేజ్ ఒక్కసారిగా నేషనల్‌కు చేరి క్రష్‌గా మారిపోయింది.
స్నేహం ప్రేమగా చిగురించి..
‘గీత గోవిందం’తో మొదలైన స్నేహం ‘డియర్ కామ్రేడ్’ చిత్రంతో ప్రేమగా మారింది. ఆ సినిమా కాన్సెప్ట్, అందులో రష్మికకు విజయ్ సపోర్ట్ చేసే విధానంతో పాటు, ఈ లోపు విజయ్ ఇంటి సైడ్ నుంచి కూడా సానుకూల వాతావరణం, అప్యాయత దక్కడంతో.. స్నేహం ప్రేమగా చిగురించింది. అప్పటి నుంచి వారిద్దరూ వెకేషన్ పేరుతో టూర్స్ వేస్తూనే ఉన్నారు. మీడియాకు చిక్కుతూనే ఉన్నారు. వన్ ఫైన్ డే.. ఎన్నాళ్లిలా మీడియాకు కళ్లు కప్పి తిరగడం అని భావించి.. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఇదే విషయాన్ని ఇరు కుటుంబ సభ్యులతో చెప్పగా వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో 2025 అక్టోబర్ 3న వీరి నిశ్చితార్థం రహస్యంగా జరిగిపోయింది. అలా వారి ప్రేమాయణం పెళ్లి వరకు వచ్చింది. మరి పెళ్లి ఎలా చేసుకోవాలనే దానిపై, దాదాపు ఇద్దరూ కొన్ని నెలలుగా ఆలోచించి పక్కా ప్లాన్డ్‌గా అంతా జరిపించారు.
One day, I missed her.
Missed her in a way that made me feel like my day would’ve been better if she were around.
Like my meals would’ve felt more wholesome if she were sitting across from me.
Like my workouts would’ve been more fun and less of a punishment if she were doing… pic.twitter.com/fy7umfHWjN— Vijay Deverakonda (@TheDeverakonda) February 26, 2026
రెండు సాంప్రదాయాలలో పెళ్లి – Virosh Wedding
ఈ క్రమంలో వారి పెళ్లి ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లికి కేవలం ఇరు కుటుంబ సభ్యులతో పాటు, వారిద్దరి లైఫ్‌లో ఇంపార్టెంట్ అయిన వారిని మాత్రమే ఆహ్వానించారు. పెళ్లి కూడా రెండు పద్ధతులలో.. అంటే, విజయ్ దేవరకొండ వైపు నుంచి తెలుగు సాంప్రదాయాలను గౌరవిస్తూ తెలుగు పద్ధతిలో పెళ్లి జరగగా, మరోవైపు అదే రోజు సాయంత్రం రష్మిక ఫ్యామిలీకి చెందిన కూర్గ్ (కొడవ) సాంప్రదాయంలో వివాహం చేసుకున్నారు. అంతకు ముందు రాజస్థాన్‌లోనే అన్నీ వేడుకలు, హల్దీ, సంగీత్, ప్రీమియర్ లీగ్ క్రికెట్ వంటి కార్యక్రమాలను నిర్వహించారు.
రిసెప్షన్‌కు ఆహ్వానం
పెళ్లి అనంతరం వారు షేర్ చేసిన ఫొటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ ఫొటోలను చూసిన వారంతా జంట బాగుందని, అభినందనలు తెలుపుతున్నారు. పెళ్లి అనంతరం ప్రధాని మోదీని కలిసి ఆశీస్సులు అందుకున్న ఈ జంట.. ఇప్పుడు రిసెప్షన్‌ను గ్రాండ్‌గా చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో భారీ స్థాయిలో వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్వయంగా రష్మిక, విజయ్ ఇద్దరూ సెలబ్రిటీలను, రాజకీయ నాయకులను, బిజినెస్ మ్యాన్‌లను ఆహ్వానిస్తున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లిన రష్మికకు తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా రీసీవింగ్ లభించింది. చీర పెట్టి మరీ రేవంత్ రెడ్డి అండ్ ఫ్యామిలీ రష్మికకు ఘన స్వాగతం పలికారు. అలాగే అల్లు అర్జున్‌ని ఆహ్వానించేందుకు విజయ్, రష్మిక ఇద్దరూ వెళ్లిన ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి.
దేశమంతా వేడుకలు
ఇక రిసెప్షన్‌కు ఎవరెవరు వస్తారు? ముఖ్యంగా కన్నడ ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు వస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే, కన్నడ ప్రేక్షకులు, కొందరు సెలబ్రిటీలు రష్మికపై ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే. ఇలా మొత్తంగా.. ప్రేమతో మొదలై, పెద్దల అంగీకారంతో పెళ్లి, ఇప్పుడు రిసెప్షన్ వరకు విజయ్, రష్మికల జర్నీ నడిచింది. ఈ గ్యాప్‌లో తమ పెళ్లి వేడుకలను అన్ని రాష్ట్రాల్లో నిర్వహంచేలా, వారి చేసిన ప్లానింగ్ కూడా అదుర్స్ అనేలా అంతా మాట్లాడుకుంటున్నారు. దేశంలోని ముఖ్యమైన నగరాల్లో స్వీట్స్ పంచడం, ప్రముఖ ఆలయాల్లో అన్నదానం నిర్వహించడం వంటి కార్యక్రమాలను ఈ విరోషి జంట నిర్వహిస్తోంది. మరోవైపు ఈ గ్యాప్‌లోనే వారు షూటింగ్‌లో కూడ పాల్గొనడం విశేషం.

