Varalaxmi: సెలబ్రిటీలు రాజకీయాల్లోకి రావడం కొత్తేం కాదు. ఇప్పటికే ఎంతోమంది రాజకీయాల్లోకి వచ్చారు.. వస్తున్నారు. ఎన్టీఆర్ (NT Ramarao) మొదలుకుని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) వరకు తెలుగు రాజకీయాల్లో చక్రం తిప్పిన సెలబ్రిటీలు ఎందరో ఉన్నారు. అలాగే తమిళ్లో కూడా. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళ పాలిటిక్స్‌లో రాజకీయాల్లోకి వచ్చిన సెలబ్రిటీలు ఎందరో ఉన్నారు. మిగతా సినీ ఇండస్ట్రీలలో అంతగా లేరని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వారి బాటలోనే ఫైర్ స్టార్ వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) కూడా రాజకీయ బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పుడే కాదు, ఆమె ఎంట్రీకి ఇంకాస్త టైమ్ ఉంది. తాజాగా ఆమె ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె రాజకీయాల గురించే కాకుండా, సోషల్ మీడియా, విడాకులు, లవ్, బ్రేకప్, తను డైరెక్ట్ చేసిన ‘సరస్వతి’ సినిమాల గురించి చెప్పుకొచ్చారు. ముందుగా ‘సరస్వతి’ (Saraswathi) సినిమా విషయానికి వస్తే..
ఆయన లేకపోతే సినిమానే లేదు- Varalaxmi
‘సరస్వతి’ సినిమాతో నటి నుంచి దర్శకురాలిగా ఆమె పరిచయం అయ్యారు. ఈ సినిమా తాజాగా విడుదలై మంచి టాక్‌నే సొంతం చేసుకుంది. ఈ సినిమా గొప్పగా రావడానికి, అలాగే తను దర్శకురాలిగా మారడానికి కారణం తన భర్తేనని వరలక్ష్మి చెప్పుకొచ్చారు. తను పుష్ చేయడం వల్లే.. ఈరోజు ఇలా దర్శకురాలిగా మీ ముందు ఉన్నానని అన్నారు. సినిమా ఫస్ట్ కట్ చూసి ఆయన ఆశ్చర్యపోయారని, ఇంత బాగా చేస్తావని అనుకోలేదని, చాలా గర్వంగా ఉందంటూ వెన్నుతట్టి ప్రోత్సహించారు. తన సపోర్ట్‌తో పాటు చెల్లెలు పూజా సపోర్ట్ కూడా తను దర్శకురాలిగా మారడానికి ఎంతో ఉందని ఆమె వెల్లడించారు.
Also Read- Ustaad Bhagat Singh: దేవి శ్రీ ప్లేస్‌లోకి థమన్.. అసలేం జరిగిందంటే?
ముందు తనే ప్రపోజ్ చేశారు
వరలక్ష్మి ప్రేమ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. ఎప్పుడో నటుడు విశాల్‌ని ఆమె పెళ్లి చేసుకోవాలి. కానీ, అనూహ్య కారణాలతో వారి లవ్ బ్రేకప్ అయింది. ఆ తర్వాత ఎవరి దారి వారు చూసుకున్నారు. విశాల్ ఇంకా అలాగే ఉంటే, వరలక్ష్మి మాత్రం నికోలాయ్ సచ్‌దేవ్‌ని పెద్దల అంగీకారంతో పెళ్లాడింది. ఇది కూడా ప్రేమ వివాహమే అని ఆమె తెలిపింది. తన ప్రేమ గురించి చెబుతూ.. ‘‘లవ్ అనేది ఒక్కరి వైపు మాత్రమే ఉండకూడదు. ఇద్దరి వైపు ఈక్వల్‌గా ఉండాలి. నా దృష్టిలో లవ్ అంటే రెస్పెక్ట్. నేను లవ్ మ్యారేజే చేసుకున్నాను. కానీ, అందరినీ ఒప్పించే చేసుకున్నాను. ఫస్ట్ తనే ప్రపోజ్ చేశారు. తను ఫస్ట్ మా అమ్మనాన్నలకు విషయం చెప్పి, అందరినీ నార్వే తీసుకుని వెళ్లి, అక్కడ అందరి సమక్షంలో నాకు ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది అందరికీ తెలిసిందే’’ అని వరలక్ష్మి చెప్పుకొచ్చారు.

ఫేస్ చూపించకపోతే దమ్ము లేనట్టే..
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువవుతున్న ట్రోలింగ్‌పై ఆమె తనదైన రీతిలో స్పందించారు. ‘‘రజినీ సార్ ఎప్పుడూ ఒకటి చెబుతారు.. ఏది ఎక్కువైనా అది పాయిజ్ అవుతుందని. అలాగే సోషల్ మీడియాను కూడా ఇందుకు అన్వయించుకోవచ్చు. ఏదైనా లిమిట్స్ క్రాస్ చేయనంత వరకు బాగానే ఉంటుంది. లిమిట్స్ క్రాస్ చేస్తేనే ప్రాబ్లమ్. సోషల్ మీడియాని క్రియేటివ్‌గా ఉపయోగించుకుంటే ఓకే. అలా చేస్తే, బయటి ప్రపంచానికి టాలెంట్ చూపించుకోవచ్చు. ఆ విషయంలో సోషల్ మీడియా ఎంతగానో యూజ్ అవుతుంది. కేవలం నెగిటివ్ కోణంలో మాత్రమే యూజ్ చేయాలనుకుంటే మాత్రం.. సోషల్ మీడియా అవసరం లేదు. నా వరకు సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ కామెంట్స్‌ని అసలు పట్టించుకోను. ఎవడో ఒకడు ఫేస్ చూపించకుండా పెట్టే కామెంట్స్‌కు నేను ఎందుకు బాధపడాలి. ఫేస్ చూపించడం లేదంటే, వాడికి దమ్ము లేనట్టే కదా. అయినా నాపై కామెంట్ చేసే రైట్ వాడికి ఎక్కడిది? సోషల్ మీడియాలో కామెంట్ చేసే విధానం ఒకటి ఉంటుంది. ఈ డ్రస్సు మీకు బాగాలేదు అంటే ఓకే.. చెండాలంగా ఉంది అని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. ఇలాగే వారికి కూడా ఎవరైనే చెబితే ఎలా ఫీలవుతారో.. గమనించుకుని అప్పుడు కామెంట్ చేస్తే బాగుంటుంది. అంతే తప్ప, ఏది పడితే అది, ఎలా పడితే అలా ట్రోల్ చేసుకుంటూ పోతే.. ఎటువంటి గ్రోత్ ఉండదు..’’ అని వరలక్ష్మి హితబోధ చేశారు.
Also Read- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇంకా సినిమాలు చేస్తాడా?
నాకున్న ఆస్తి అదే..
సెలబ్రిటీలకు బోలెడన్ని ఆస్తులు ఉంటాయని అంతా అనుకుంటూ ఉంటారు. కానీ, వరలక్ష్మికి ఉండటానికి ఇల్లు కూడా లేదట. ఈ విషయం స్వయంగా ఆమెనే చెప్పారు. తన ఆస్తుల గురించి వరలక్ష్మి మాట్లాడుతూ.. ‘‘నేనేదో సెలబ్రిటీ కుమార్తెను. అలాగే సెలబ్రిటీని కాబట్టి.. నా వెనుక బోలెడన్ని ఆస్తులు ఉన్నాయని అంతా అనుకుంటారు. నిజంగా నాకు ఎటువంటి ప్రాపర్టీస్ లేవు. ఇంకా చెప్పాలంటే ఇల్లు కూడా లేదు. ప్రస్తుతం రెంట్‌కే ఉంటున్నాను. నేను సంపాదించిన దానితో ఒక కారు కొనుక్కున్నా. ఇటీవలే ఒక చిన్న హౌస్ కొనుక్కున్నా. నాకు ఆస్తులంటూ ఏమీ లేవు.. అభిమానులు చూపించే ప్రేమే నా ఆస్తి’’ అని వరలక్ష్మి తన ఆస్తుల గురించి చెప్పారు.
రాజకీయాల్లోకి వస్తా..
ఏదో ఒక రోజు పాలిటిక్స్‌లోకి వస్తానని ఉన్న విషయం చెప్పేశార వరలక్ష్మి శరత్ కుమార్. పాలిటిక్స్ గురించి ఆమె మాట్లాడుతూ.. ‘‘నాకు పాలిటిక్స్ అంటే ఇష్టం ఉంది. ఏదో ఒకరోజు కచ్చితంగా పాలిటిక్స్‌లోకి వస్తా. నేనే కాదు ఇంకా యంగ్ స్టర్స్ ఎందరో పాలిటిక్స్‌లోకి రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడున్న జనరేషన్ ప్రాబ్లమ్స్ తెలియాలంటే, వాటికి సొల్యూషన్ రాబట్టాలన్నా.. ఇప్పటి యంగ్ స్టర్స్ కచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి. అలా కాకుండా. ఇంకా 70 ఏళ్ల వయసున్న వాళ్లే పాలిస్తామంటే.. వాళ్లకి అసలు ఏం తెలుసు? వాళ్లెవరు రూల్ చేయడానికి.. ప్రస్తుతం ఈ గ్యాప్‌ని ఫిల్ చేయడం చాలా అవసరం. అందుకే యంగ్ స్టర్స్ పాలిటిక్స్‌లోకి రావాలని నేను పిలుపునిస్తున్నాను.
Also Read- Virosh Wedding: విజయ్, రష్మికల ప్రేమ నుంచి పెళ్లి రిసెప్షన్ వరకు.. జరిగింది ఇదే!
తెలుగు రాజకీయాల్లోకే..
రాజకీయాల్లోకి వస్తా.. అది తమిళ్ అయినా కావచ్చు.. లేదంటే తెలుగు రాజకీయాల్లోకి అయినా రావచ్చని వరలక్ష్మి కుండబద్దలు కొట్టేశారు. దీనిపై ఆమె మాట్లాడుతూ.. ‘‘ఇండియాలో చెత్తని ఎక్కడ పడితే అక్కడ వేసేస్తుంటారు. అలా వేసే వారిని ఫారిన్ పంపిస్తే.. అలా చేయరు. ఎందుకంటే, అక్కడ ఫైన్ వేస్తారు. ఆ భయం మనం కూడా కలిగించాలి. ఇండియాలో అలా భయపెట్టే వారు లేరు. అలాంటి భయం రావాలంటే శిక్షలు చాలా కఠినంగా ఉండాలి. ఇలాంటి శిక్షలు ఉంటాయి కాబట్టే.. అరబ్ దేశాల్లో క్రైమ్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. నేను రాజకీయాలలోకి రావడానికి తమిళనాడే కావాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాలలోనూ నాకు బోలెడంత మంది అభిమానులు ఉన్నారు. ఏమో.. తెలుగు రాజకీయాల్లోకే రావచ్చేమో.. అయినా పోటీ ఎక్కడ చేశామన్నది కాదు ప్రశ్న.. మనం ప్రజలకు ఏం చేసామన్నదే ఇక్కడ ఇంపార్టెంట్’’ అని వరలక్ష్మి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

