Shah Rukh Khan:బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటుడిగానే కాకుండా తెలివైన పెట్టుబడిదారుడిగానూ గుర్తింపు పొందారు. ఆయన ముంబైలోని విలాసవంతమైన నివాసం మన్నత్ గురించి ఎప్పుడూ అభిమానుల్లో ఆసక్తి నెలకొంటూనే ఉంటుంది. ఒకప్పుడు రూ.18.32 కోట్లకు కొనుగోలు చేసిన ఈ బంగ్లా విలువ ప్రస్తుతం సుమారు రూ.300 కోట్లకు పైగానే చేరిందని అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో ఒక్క ఇంటి ద్వారానే ఆయనకు దాదాపు రూ.282 కోట్ల విలువ పెరిగినట్లు జనాలు మాట్లాడుకుంటున్నారు.
1995లో కొనుగోలు.. కలల ఇంటిగా మన్నత్:
షారుక్ ఖాన్ (Shah Rukh Khan)తన సినీ కెరీర్ ప్రారంభ దశలోనే ఈ బంగ్లాపై ప్రత్యేకమైన ఆసక్తిని పెంచుకున్నారు. 1995లో అప్పటి యజమాని కేకు గాంధీ నుంచి ఈ ఆస్తిని దాదాపు రూ.18.32 కోట్లకు కొనుగోలు చేశారు. అంతకుముందు ఈ బంగ్లా పేరు “విల్లా వియన్నా”గా ఉండేది. కొనుగోలు అనంతరం దీనికి “మన్నత్” అనే పేరు పెట్టారు. మొదట “జన్నత్” అని అనుకున్నప్పటికీ, చివరికి షారుక్-గౌరీ దంపతులు మన్నత్ అనే పేరునే ఖరారు చేశారు.
గౌరీ ఖాన్ డిజైన్ చేసిన అద్భుతమైన ఇంటీరియర్:
వృత్తిరీత్యా ఇంటీరియర్ డిజైనర్ అయిన గౌరీ ఖాన్ ఈ ఇంటిని ప్రత్యేక శైలిలో తీర్చిదిద్దారు. 1920ల నిర్మాణ శైలికి ఆధునిక హంగులను జోడిస్తూ దాదాపు నాలుగేళ్ల పాటు ఇంటీరియర్ పనులు చేపట్టారు. ఐదు బెడ్‌రూమ్‌లు, విశాలమైన లివింగ్ స్పేస్, ఆధునిక జిమ్, లైబ్రరీతో పాటు అత్యాధునిక సౌకర్యాలతో ఈ బంగ్లా ఆకట్టుకుంటుంది.
ALSO READ:ఒక ఇంటితోనే రూ.282 కోట్ల లాభం.. షారుఖ్ ఖాన్ రియల్ ఎస్టేట్ మ్యాజిక్ అదుర్స్..!
సినిమాల షూటింగ్ లొకేషన్‌గా గుర్తింపు:
షారుక్ కొనుగోలు చేయకముందే ఈ బంగ్లా పలు హిందీ చిత్రాల షూటింగ్‌కు వేదిక అయింది. గోవింద ప్రధాన పాత్రలో వచ్చిన “షోలా ఔర్ షబ్నమ్” వంటి చిత్రాల సన్నివేశాలు ఇక్కడ చిత్రీకరించారు.
ALSO READ:Kannada Actors:రగ్గడ్ లుక్.. పవర్‌ఫుల్ నటన.. టాలీవుడ్‌లో కన్నడ విలన్లకు పెరుగుతున్న క్రేజ్!
ముంబైలో గుర్తింపు పొందిన ల్యాండ్‌మార్క్:
ప్రస్తుతం మన్నత్ కేవలం షారుక్ ఖాన్ నివాసమే కాదు, ముంబైలో ప్రముఖ ల్యాండ్‌మార్క్‌లలో ఒకటిగా మారింది. ప్రతిరోజూ వందలాది మంది అభిమానులు ఈ బంగ్లా వద్దకు చేరుకుని ఫోటోలు దిగుతుంటారు. సినీ విజయాలతో పాటు సరైన సమయంలో ఆయన చేసిన రియల్ ఎస్టేట్ పెట్టుబడి కూడా షారుక్ ఆస్తి విలువ అమాంతం పెరగడానికి కారణమైందని సినీ వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.వరుసగా పఠాన్, జవాన్, డంకి వంటి చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నారు అలాగే టైగర్ 3 చిత్రంలో కూడా క్యామియో పాత్రలో నటించి మంచి పేరు సంపాదించిన షారుఖ ప్రస్తుతం కింగ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కూడా రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.




