మూవీ పేరు: ‘వీరభద్రుడు’
నటీనటులు: సూర్య, త్రిష, ఆర్జే బాలాజీ, నట్టి సుబ్రమణియన్ తదితరులు
విడుదల తేదీ: 15, మే 2026
సంగీతం: సాయి అభ్యంకర్
రచన, దర్శకత్వం: ఆర్జే బాలాజీ
Veerabhadrudu: హీరో సూర్య (Suriya)కు హిట్ వచ్చి చాలా కాలం అవుతుంది. ఆయన ఎన్ని రకాలుగా ప్రయత్నించినా హిట్ మాత్రం ఆయన దరికి చేరడం లేదు. ‘కంగువా’, ‘రెట్రో’ వంటి సినిమాలు భారీ అంచనాలతో వచ్చి, అంతే భారీగా పరాజయం చవిచూశాయి. దీంతో, సూర్య పని అయిపోయిందని అనుకుంటున్న సమయంలో అందరినీ ఆశ్చర్యపరిచేలా, రెండు మూడు సినిమాల దర్శకత్వ అనుభవం ఉన్న నటుడు, దర్శకుడు ఆర్జే బాలాజీకి అవకాశం ఇచ్చారు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఒక్కసారిగా వార్తలలో హైలెట్ అయింది. ఆర్జే బాలాజీ (RJ Balaji)తో సినిమా అనగానే ముందు అంతా ఆశ్చర్యపోయినా, భారీ హైప్‌కి పోకుండా.. సూర్య మంచి నిర్ణయమే తీసుకున్నాడనేలా టాక్ మొదలైంది. ‘వీరభద్రుడు’ (Veerabhadrudu) టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పోస్టర్స్ అన్నీ సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. అదే సమయంలో రిలీజ్ సమయంలో ఏర్పడిన డిలే కూడా ఈ సినిమాపై భారీగా హైప్ క్రియేట్ అయ్యేలా చేసింది. దీంతో రావాల్సిన రోజు కాకుండా, ఒక రోజు ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? సూర్యకి సక్సెస్‌ని ఇచ్చిందా? లేదా? అనేది తెలియాలంటే రివ్యూ చూడాల్సిందే.
Also Read- Nargis Fakhri: టాలీవుడ్ సినిమాలో నర్గీస్ ఫక్రీ స్పెషల్ సాంగ్
కథ: (Veerabhadrudu Story)
కుమార్తెకు శస్త్ర చికిత్స నిమిత్తం 60 సవర్ల బంగారంతో హైదరాబాద్‌కు వచ్చిన ఓ తండ్రి దగ్గర నుంచి దొంగలు, ఆ బంగారాన్ని దోచుకుపోతారు. ఆ బంగారం అమ్మి, కుమార్తె ఆరోగ్యాన్ని సరిచేయించుకోవాలని వచ్చిన ఆ తండ్రి.. పోలీసులను ఆశ్రయించగా, వారు 45 సవర్ల బంగారం రికవరీ చేస్తారు. కాకపోతే, అది ఆ తండ్రికి చేరడానికి కోర్టు ఆర్టర్ కావాల్సి వస్తుంది. ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. కోర్టు ఆర్డర్ నిమిత్తం బేబీ కృష్ణ (ఆర్జే బాలాజీ) సహాయం కోరగా, అతను వారి దగ్గర నుంచి మనీ కోసం రకరకాలుగా ప్లాన్ చేస్తుంటాడు. జడ్జితో కుమ్మక్కై వాయిదాల మీద వాయిదాలు వేయిస్తుంటాడు. ఆ విషయం ఆ తండ్రికి తెలిసి, నిలదీయగా.. ఆ రికవరీ గోల్డ్ కూడ రాకుండా చేస్తానని బెదిరిస్తాడు. ఇక లాభం లేక ఆ తండ్రి, ఆ కోర్టు ఆవరణలో ఉన్న వీరభద్రుడి ఆలయానికి వెళ్లి, తనకు న్యాయం చేయమని వేడుకుంటాడు. ఆ వీరభద్ర స్వామి సూర్య రూపంలో భూమి మీదకు వస్తాడు. భూమి మీదకు వచ్చిన దేవుడు ఆ తండ్రీకూతుళ్లకు న్యాయం చేశాడా? ఎలా న్యాయం చేశాడు? కోర్టుని ఇష్టం వచ్చినట్లుగా వారి స్వార్థానికి వాడుకుంటున్న వారికి వీరభద్రుడు ఎలా బుద్ధి వచ్చేలా చేశాడు? అనేదే ఈ సినిమా కథ.
Also Read- Doordarshini: ‘దూరదర్శని’ మనసులను హత్తుకుంటుంది
నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:
సూర్య ఎంట్రీ కాస్త ఆలస్యమైనప్పటికీ, ఆయన కనిపించినప్పటి నుంచి సినిమా మొత్తం తనై నడిపించాడు. సూర్యని భారీగా ఊహించుకుని వెళితే, కాస్త డిజప్పాయింట్ అవుతారు కానీ, ఎటువంటి అంచనాలు లేకుండా వెళితే మాత్రం, సరికొత్త సూర్యని చూడొచ్చు. సూర్య చేయాల్సిన కథ అయితే ఇది కాదు.. ఎందుకంటే, ఆయన ఇప్పటి వరకు చేసిన పాత్రలు అలాంటివి. అయినా సరే, నటన విషయంలో ఎక్కడా సూర్య తగ్గలేదు. త్రిష పాత్రకు అంతగా ఇంపార్టెన్స్ లేదు. ఒక రెండు, మూడు మంచి సీన్లు త్రిషకు పడ్డాయి. ఇక ఈ కథలో కీలక పాత్ర బేబీ కృష్ణగా నటించిన ఆర్జే బాలాజీదని చెప్పుకోవచ్చు. ఈ పాత్రకు బాలాజీ కాకుండా ఇంకాస్త పవర్ ఫుల్ నటుడిని తీసుకుని ఉంటే మాత్రం, సినిమా ఇంకాస్త రక్తికట్టేది. సూర్య ముందు ఆర్జే బాలాజీ అంతగా సరిపోలేదనే చెప్పుకోవాలి. ఇంకా మిగతా పాత్రలలో చేసిన వారంతా ఓకే.

సాంకేతికంగా ఈ సినిమా చాలా ఉన్నతంగా తెరకెక్కించారు. సినిమా డౌన్ అవుతున్న ప్రతిసారి సాయి అభ్యంకర్ తన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ఎలివేట్ చేశాడు. ఆ సినిమాకు ప్రధాన బలం ఆ మ్యూజిక్ అనే చెప్పవచ్చు. సినిమాటోగ్రఫీ కూడా మూడ్ తగినట్లుగా ఉంది. ఇంకా ఇతర సాంకేతిక నిపుణులందరూ తమ పనితనం ప్రదర్శించారు. కథ గురించి మాట్లాడుకుంటే, ఇందులో కొత్తదనం ఏమీ కనిపించదు. క్లైమాక్స్‌లో కొన్ని మెరుపులు, సూర్య నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అని చెప్పుకోవచ్చు.
Also Read- Veerabhadrudu: ఫస్టాఫ్ కోర్ట్‌రూమ్ డ్రామా.. సెకండాఫ్ ఊరమాస్!
విశ్లేషణ:
ఈ భూమి మీద భగవంతుడు అవతరించడానికి కారణం దుష్టులను శిక్షించడానికి, మంచివారిని రక్షించడానికి అనే చెబుతూ ఉంటారు. ఈ పాయింట్‌తో ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి కూడా. ఇందులో కూడా అలాంటి పాయింట్‌నే బాలాజీ రాసుకున్నారు. కాకపోతే, భగవంతుడే భూమి మీదకు వస్తున్నాడంటే ఎలాంటి కష్టాన్ని సృష్టించాలి. అలా క్రియేట్ చేయడంలో దర్శకుడు తడబడ్డాడు. కష్టాన్ని సృష్టించే దుష్టుడి పాత్రను స్వయంగా దర్శకుడే పోషించినా కూడా మెరుపులు మెరిపించలేకపోయాడు. దేవుడి ముందు నిలబడి పోరాడే రాక్షసుడు ఎలా ఉండాలో.. కోడి రామకృష్ణ సినిమాలు చూస్తే తెలుస్తుంది. తండ్రీకూతుళ్ల నేపథ్యంతో మొదలు పెట్టి, కోర్టు డ్రామాగా నడిపించాడు. ఈ పాయింట్‌తో ఎంత డ్రామానైనా క్రియేట్ చేయవచ్చు. కానీ బాలాజీ తన పాత్రను హైలెట్ చేసుకోవడానికే ప్రయత్నిస్తూ, హీరోని చాలా ఆలస్యంగా స్క్రీన్‌పైకి తీసుకొచ్చాడు. పోనీ ఆ సన్నివేశాలైనా ఇంపార్ట్ కలిగించాయా? అంటే అదీ లేదు. మరీ విడ్డూరం ఏమిటంటే.. దేవుడికి కూడా ఆంక్షలు పెట్టడం. ఒక్కో ఏరియాలో ఒక్కో దేవుడికి పవర్ ఉంటుందని చెప్పడం నవ్వు తెప్పిస్తుంది. దేవుడని తెలిసి కూడా ఆయనపై దాడి చేయించడం, అందుకు ఆ దేవుడు పారిపోవడం.. ఇవన్నీ కథకి అడ్డుపడుతూ ఉంటాయి. క్లైమాక్స్‌లో కాస్త తాండవం చేయించాలని ప్రయత్నించడం కాస్త ఉపశమనం కలిగించే అంశం. ప్రస్తుతం మార్కెట్‌లో మంచి సినిమా లేకపోవడం, కమర్షియల్ సినిమా వచ్చి చాలా రోజులు అవుతుండటంతో.. కలెక్షన్లపరంగా మాత్రం ఈ సినిమా బాగానే స్కోర్ చేస్తుంది. మంచి సినిమా పోటీకి ఉండి ఉంటే మాత్రం ఈ సినిమా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చేది. అలా సూర్య ఖాతాలో కూడా ఇంకో పరాజయం చేరేది. మంచి టైమ్‌లో విడుదలవడమే ఈ సినిమాకు కలిసొచ్చిన అంశం. సూర్య కోసమైతే ఒకసారి చూడొచ్చు.
ట్యాగ్‌లైన్: భద్రుడే.. వీర కాదు!
రేటింగ్: 2.75/5


