Vijay Sethupathi:తమిళ సినీ పరిశ్రమలో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగినటులలో “మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి” ఒకరు. తన సహజ నటనతో తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన చిన్ననాటి జీవితం, కుటుంబం ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, సినిమాలోకి వచ్చిన పరిస్థితుల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
అప్పుల భారంతో గడిచిన బాల్యం :
తన చిన్ననాటి రోజులు ఎంతో కష్టాలలో గడిచాయని విజయ్ సేతుపతి(Vijay Sethupathi) తెలిపారు. కుటుంబం అవసరాల కోసం తన తండ్రి చేసిన అప్పులు చెల్లించడం చాలా కష్టమయ్యేది అని చెప్పుకొచ్చారు. కొన్ని సందర్భాలలో అప్పులు వసూలు చేసేందుకు వ్యక్తులు ఇంటి వరకు వచ్చే వారిని గుర్తు చేసుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో తండ్రి ఒంటరిగా బాధపడకుండా ఆయన పక్కనే కూర్చుని ఉండేవాడినని ఎమోషనల్ గా స్పందించారు. ప్రతి రోజు రాత్రి తన తండ్రి బుల్లెట్ బైక్ పై ఇంటికి వచ్చేటప్పుడు ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చి కుటుంబ సభ్యులతో కలిసి తినడం ఇప్పటికీ మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది అని చెప్పారు. తనకు మొదటి నుంచి హీరో కావాలని లక్ష్యం లేదు అని విజయ్ సేతుపతి స్పష్టం చేశారు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలని ఉద్దేశంతోనే సినిమాల వైపు అడుగులు వేశానని చెప్పారు. కష్టపడి పని చేయడమే తనకు ఇష్టమని ఏ పని చేసినా గౌరవంగా చేయాలి అని ఎప్పుడు భావించే వాడినని పేర్కొన్నారు.
సినిమాలకు ముందు ఎన్నో ఉద్యోగాలు :
సినిమాలోకి రాకముందు దుబాయిలో అకౌంటెంట్ గా పని చేసినట్లు ఆయన తెలిపారు. అంతకుముందు కూలి పనులు కూడా చేయడంతో పాటు రిటైల్ స్టోర్ లో సేల్స్ మాన్ గా , ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో క్యాషియర్ గా, ఫోన్ బూత్ ఆపరేటర్ గా కూడా పనిచేశానని చెప్పారు . జీవనోపాధి కోసం వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నాను అని వెల్లడించారు.
ALSO READ:Tv Movies:జులై 10 శుక్రవారం టీవీలో సందడి చేసే సినిమాలు ఇవే!
చిన్న పాత్ర నుంచి స్టార్ హీరోగా:
దుబాయ్ నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత నాటక రంగంతో పరిచయం ఏర్పడిందని, అదే తన సినీ ప్రయాణానికి బాటలు వేసిందని విజయ్ సేతుపతి తెలిపారు. తొలుత చిన్న పాత్రలు పోషిస్తూ నటుడిగా గుర్తింపు పొందిన ఆయన, ‘తెన్మేర్కు పరువకాట్రు’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. అనంతరం ‘సూదు కావ్వుం’, ‘విక్రమ్ వేద’, ‘మహారాజా’ వంటి విభిన్న కథా చిత్రాలతో అగ్ర నటుడిగా ఎదిగారు. ప్రస్తుతం ఆయన నటించిన ‘ట్రైన్’, ‘స్లమ్‌డాగ్’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.




